Formula E-Race:  2024  ఫిబ్రవరిలోనూ ఫార్ములా E రేసింగ్‌కు హైదరాబాద్ వేదికగా ఉంది. అయితే తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2024 ఫిబ్రవరి 10న షెడ్యూల్ చేసిన రేసింగ్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది ఫిభ్రవరిలో నిర్వహించిన ఫార్ములా-ఈ స్ట్రీట్ రేస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా.. రానున్న ఫిబ్రవరిలో జరగవలసిన రేస్ దాదాపుగా రద్దయినట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ రావడంతో రేస్ నిర్వహించడం కష్టం అని నిర్వాహకులు భావిస్తున్నారు.


ఫార్ములా ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బృందం ఈ నెల ప్రారంభంలో తెలంగాణలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంతో సమావేశమైంది. అప్పటి నుంచి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భారీ ఈవెంట్‌కు మరికొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. అయినా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈవెంట్ నిర్వహణపై ఈ రేసింగ్ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టోక్యో, షాంఘై, బెర్లిన్, లండన్‌లతో సహా ఇతర ప్రముఖ ప్రపంచ నగరాలలో వచ్చే ఏడాది రేసును నిర్వహించబోతున్నారు. 


గత ప్రభుత్వ హయంలో ఫార్ములా E సంస్థ ఈ ప్రిక్స్‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి 30 అక్టోబర్ 2023న రేసింగ్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకుంది.  భారీ రేసింగ్‌కు హైదరాబాద్ నగరం కూడా ఒక హోస్ట్ సిటీగా ఉంది. గతంలో  తొలిసారిగా జరిగిన ఈ ఇంటర్నేషనల్ ఫార్ములా – రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను చూసేందుకు పలువురు క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్ నగరంలో క్యూ కట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్ ఫార్ములా ఇ రేసింగ్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని మరోసారి జోష్ వస్తుందని అనుకున్నారు. 
 
 రేస్‌కు మరో ఐదు వారాలే గడువు ఉండడంతో రేస్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఫార్ములా రేస్ ప్రతినిధులు సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే రేస్‌ నిర్వహణ కోసం భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రతినిధులు ప్రభుత్వం దగ్గర విన్నవించుకున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా రేస్ నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు. ప్రభుత్వ స్పందనను బట్టే రేసు ఉంటుందా లేదా అన్నది తేలుతుంది.           


పర్యావరణ పరిరక్షణ, పెట్రోల్, డీజీల్ వంటి తరిగిపోయే ఇంధనాల నుంచి ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడం, కాలుష్య నివారణ వంటి విధానంలో భాగంగా వీటిని ప్రారంభించారు. ఈ రేసుల్లో ప్రత్యేకంగా ట్రాక్ వేయక్కర్లేదు. అప్పటికే ఉన్న రోడ్లపై రేస్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసి నిర్వహిస్తారు. వీటిని రెండు రోజుల్లోనే ముగిస్తారు. ఈ రేస్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ ఘాట్, ఐమాక్స్, ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ మీదుగా జరుగేలా గతంలో ఏర్పాట్లు చేశారు. అదే ట్రాక్ వినియోగించుకోనున్నారు. అయితే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.