Tejas OTT Release: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘తేజస్’. అక్టోబర్ 27వ థియేటర్లలో విడుదల అయ్యింది. సర్వేశ్ మేవారా దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో, కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటించింది. సినిమా విడుదలకు ముందు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ ఊహించారు. అయితే, బాక్సాఫీస్ దగ్గర అనుకు స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. వసూళ్ల పరంగానూ సత్తా చాటలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది.   


జనవరి 5న జీ5లో స్ట్రీమింగ్


‘తేజస్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. జీ5 ఓటీటీ వేదికగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 5 2024 నాడు స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ విషయాన్ని జీ5 అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ విడుదల చేసింది. అయితే, ఈ సినిమా ఎన్ని భాషల్లో విడుదల అవుతుంది? అనే విషయాన్ని మాత్రం సదరు ఓటీటీ సంస్థ ప్రకటించలేదు. 2016లో భారత వైమానిక దళంలోకి తొలిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించింది భారత ప్రభుత్వం. ఈ అంశాన్ని కథాంశంగా చేసుకుని ‘తేజస్’ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కంగనా ఎయిర్ ఫోర్స్ ఫైలెట్ గా కనిపించింది. శత్రుదేశం పాకిస్తాన్ లో చేపట్టే ఓ ఆపరేషన్ లో ఆమె పాల్గొంటుంది. అయితే, ఈ సినిమా సుమారు రూ. 60 కోట్లతో తెరకెక్కింది. కానీ, బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ. 10 కోట్లు వసూళు చేసింది. కంగనా కెరీర్ లోనే ఈ మూవీ అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది. 






ఆకట్టుకోని ‘చంద్రముఖి 2’


‘తేజస్’ కంటే ముందు కంగనా నటించిన ‘చంద్రముఖి 2’ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. తమిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘చంద్ర‌ముఖి’కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీర‌వాణి సంగీతం అందించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మాణంలో భారీ అంచ‌నాల న‌డుమ సెప్టెంబ‌ర్ 28న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ అయ్యింది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సుమారు రూ.60 కోట్ల‌ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ. 40 కోట్లు వసూళు చేసింది. నిర్మాతలకు పెద్దమొత్తంలో నష్టాన్ని కలిగించింది.


ఆశలన్నీ ‘ఎమర్జెన్సీ’ మీదే!


ప్రస్తుతం కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమా చేస్తోంది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కంగనా ఇందిరా గాంధీగా కనిపించబోతోంది. ఈ సినిమాకు కంగనా దర్శకత్వం వహించడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదలై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచింది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.  


Read Also: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు?