Putin On Lok Sabha Election:


పుతిన్‌ విషెస్..


వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ప్రధాని నరేంద్ర మోదీ మూడో సారి గెలవాలని విషెస్ చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రెండు దేశాల మధ్య మైత్రి మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఇరు దేశాలూ ఇదే మైత్రిని కొనసాగించాలని అన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే (Putin Wishes Modi) రష్యాలో పర్యటించాలని ఆహ్వానం కూడా పంపారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులపైనా ఇప్పటికే మోదీతో మాట్లాడినట్టు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉన్న సమస్యల్ని శాంతియుతంగా ఎలా పరిష్కరించాలో ఆలోచించాలని మోదీతో చెప్పినట్టు తెలిపారు పుతిన్. ప్రపంచవ్యాప్తంగా రష్యాకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ..భారత్‌తో మాత్రం ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. 


"నాకెంతో ఇష్టమైన వ్యక్తి, నా మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే రష్యాలో పర్యటించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితులపై చర్చించడంతో పాటు భారత్‌తో మైత్రిని ఇంకెలా ముందుకు తీసుకెళ్లాలన్నదీ చర్చించాలని అనుకుంటున్నాను. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను"


- పుతిన్, రష్యా అధ్యక్షుడు 


ఆహ్వానం..


వచ్చే ఏడాది మొదటి ఐదు నెలల పాటు భారత్‌లో ఎన్నికల హడావిడి ఉంటుందని తెలుసని, అయినా కొంత సమయం కేటాయించుకుని రష్యాకి రావాలని ప్రధాని మోదీని కోరారు పుతిన్. నిజానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్‌ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. ఎటు వైపూ నిలబడకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. పుతిన్‌తో పాటు జెలెన్‌స్కీతోనూ పలు సందర్భాల్లో చర్చించింది. ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇది యుద్ధాల కాలం కాదని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. రష్యాకి వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని పశ్చిమ దేశాలు కాస్త ఒత్తిడికి గురి చేసినప్పటికీ భారత్‌ మాత్రం అలా తలొగ్గలేదు. 


ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. గతంలో చాలా సందర్భాల్లో ఆయన లీడర్‌షిప్‌ని పొగిడారు. ఆయన తీసుకునే నిర్ణయాలూ అద్భుతం అని కితాబునిచ్చారు. ఇప్పుడు మరోసారి మోదీని ప్రశంసించారు పుతిన్. ఆయన నేతృత్వంలో భారత్ దూసుకుపోతోందని అన్నారు. అంతే కాదు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. రష్యా మీడియా RT ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్‌ అభివృద్ధి దేశంగా చాలా వేగంగా అడుగులు వేస్తోందని వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. సైబర్‌ క్రైమ్‌తో పాటు ఫైనాన్షియల్ సెక్యూరిటీ రంగాల్లో భారత్ రష్యా కలిసి పని చేస్తాయన్న నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు పుతిన్. 


Also Read: Ayodhya Temple Inauguration Ceremony: రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం రాలేదన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్