Andhra Pradesh News: గెలుపే లక్ష్యంగా పావులు కదువుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకుంటున్న నిర్ణయాలు ఆశావాహుల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరును సర్వేల ద్వారా తెలుసుకుంటూ అవసరమైతే వారిని మార్చేందుకు కూడా వెనుకాడటం లేదు. నేరుగా వారికే మార్పు తప్పదని తేల్చి చెప్పేస్తోంది. ఈ న్యూస్ తెలుసుకుంటున్న ద్వితీయ శ్రేణి నేతలు రేసులో ఉండేందుకు తహతహలాడుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ లేదనే చెప్పడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆశావాహులు భారీగా పెరిగిపోతున్నారు. వీరిలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువగా ఉంటున్నారు. ఇన్నాళ్లూ బలం అనుకొని నామినేటెడ్ పదువులకు రికమండ్ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేకే పోటీ అవుతున్నారు. టికెట్ రేసులో నామినేటెడ్ పదవులు పొందిన వారు, స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వారే అధికంగా ఉండడం సిట్టింగ్‌లకు పెద్ద తలనొప్పిగా మారిందట. పార్టీ బలోపేతాని వచ్చే ఎన్నికల్లో తన విజయం కోసం పని చేస్తారని అవకాశం కల్పిస్తే తమకే పోటీగా మారుతున్నారని నేతలు ఆగ్రహంతో ఉన్నారని టాక్ .
బహిరంగ సభలోనే ఎమ్మెల్యే పొన్నాడ ఆగ్రహం..
నమ్మి పదవులిస్తే వెన్నుపోటు పొడుస్తారా అంటూ ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఐ.పోలవరం నాయకులపై మండిపడ్డారు. పేరు ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు చేసింది ఈ నియోజకవర్గానికి చెందిన ఏఎంసీ ఛైర్మన్, ఐ.పోలవరం జడ్పీటీసీని ఉద్దేశించి అని అందరికీ తెలిసిందే. రెండు రోజుల క్రితం ముమ్మిడివరం ఏఎంసీ ఛైర్మన్ శివరామకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి తాను పోటీకు సిద్ధం అని కామెంట్ చేశారు. ఐ.పోలవరం జడ్పీటీసీ కూడా పోటీకి సిద్ధమని సంకేతాలిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే పొన్నాడ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాలోనూ..
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కవన్న సంకేతాలతో ద్వితీయ శ్రేణి నేతలు అవకాశం కల్పిస్తే సిద్ధమన్న అంటున్నారు. ఇప్పటికే తమ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాలంటూ పార్టీ అధిష్ఠానం వద్ద రాయబారాలు నెరుపుతున్నారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి అయినవిల్లి జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాస్‌తోపాటు మరికొందరు పోటీకి సిద్ధమని చెప్పేశారట. అమలాపురం నియోజకవర్గంలోనూ పలువురు నేతలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే అమలాపురంలో ముగ్గురు నేతలు అవకాశం కల్పిస్తే పోటీ చేసేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపించారట.
టీడీపీలో కూడా ఇదే పరిస్థితి..
వైసీపీలోనే కాదు టీడీపీలో కూడా ద్వితీయశ్రేణి నాయకత్వం టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నియోజకవర్గ ఇంచార్జ్‌లుగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. పార్టీ అవకాశం ఇస్తే పోటీలో ఉంటామని బహిరంగంగా ప్రకటించడం, వారికి అనుకూలంగా పార్టీ క్యాడర్‌లోను చీలిక రావడం తలనొప్పిగా మారిందట. అమలాపురం నియోజకవర్గంలో ఇంచార్జ్‌గా అయితాబత్తుల ఆనందరావు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి ఆశావాహులు సంఖ్య బలంగానే కనిపిస్తోంది.. నలుగురు నాయకులు పోటీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పి.గన్నవరం నియోజకవర్గంలో ఇంచార్జ్‌గా హరీష్‌మాధూర్ ఉన్నారు. ఇక్కడి నుంచి ముగ్గురు రెడీ అంటున్నారు. ముమ్మిడివరం కాకినాడ రూరల్ నుంచి ద్వితీయశ్రేణి నాయకులు పోటీకి సిగ్నల్ ఇస్తున్నారు. ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకత్వం బరిలో నిలిచేందుకు కాలు దువ్వుతోంది.