In Vitro Fertilization Technique: పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు ఇటీవలే IVF ద్వారా ఓ మగ బిడ్డకి జన్మనిచ్చారు. ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌కి దారి తీసింది. 60 ఏళ్ల వయసులో ఈ పద్ధతిలో బిడ్డని కనడం అవసరమా అని కొందరు వాదిస్తుంటే..మరి కొందరు ఎవరిష్టం వాళ్లదంటూ తేల్చి చెబుతున్నారు. మొత్తానికి IVFపై మరోసారి చర్చ మొదలైంది. బిడ్డ డాక్యుమెంట్స్ విషయంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ సిద్దూ తండ్రి బల్కౌర్ సింగ్ ఆరోపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం సిద్దూ మూసేవాలా హత్యకు గురయ్యాడు. ఈ హత్య జరిగిన తరవాత రెండేళ్లకు సిద్దూ తల్లిదండ్రులు మరో బిడ్డకి జన్మనిచ్చారు. 


"జిల్లా అధికారులు నన్ను వేధిస్తున్నారు. చిన్నారికి సంబంధించిన  డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేశాను. అయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రి, అధికారులు జోక్యం చేసుకోవాలి. ట్రీట్‌మెంట్ జరిగేంత వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కావాల్సినప్పుడల్లా నేను అందుబాటులోనే ఉంటాను. లీగల్ డాక్యుమెంట్స్‌ని కచ్చితంగా సబ్మిట్ చేస్తాను"


- బల్కౌర్ సింగ్, సిద్ధూ తండ్రి






కేంద్ర ప్రభుత్వం ఆరా..


అయితే...కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంపై దృష్టి సారించింది. బల్కౌర్ సింగ్, చరణ్ సింగ్‌లు IVF ద్వారా బిడ్డకి జన్మనివ్వడంపై  ఆరా తీసింది. ఈ ట్రీట్‌మెంట్‌కి సంబంధించి వయో పరిమితి గురించీ ప్రస్తావించింది. 21-50 ఏళ్లలోపు వాళ్లు మాత్రమే IVF ద్వారా బిడ్డకి జన్మనివ్వడం సురక్షితం అని స్పష్టం చేసింది. Assisted Reproductive Technology (Regulation) Act, 2021 ని ప్రస్తావించింది. ఈ చట్టంలోని Section 21(g)(i)  ప్రకారం 21-50 ఏళ్ల లోపు మహిళలకు మాత్రమే ఈ IVF ట్రీట్‌మెంట్‌ ద్వారా పిల్లలకు జన్మనిచ్చే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీనిపై ఓ రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. బల్కౌర్ సింగ్, చరణ్ సింగ్ దంపతులకు గత వారం మగ బిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు బల్కౌర్ సింగ్. రెండేళ్ల క్రితం తన స్నేహితులతో కలిసి సిద్దూ మూసేవాలా బయటకు వెళ్లాడు. ఆ సమయంలోనే కొందరు దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. ఈ దాడిలో సిద్దూ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ ఘటన పంజాబ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 






Also Read: రామ్ దేవ్ బాబాకి సుప్రీంకోర్టు నోటీసులు, పతంజలి ప్రకటనలపై తీవ్ర అసహనం