Telugu breaking News: మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం

Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 13 Feb 2024 07:24 PM
లక్ష కోట్లు ఖర్చుపెట్టినా, లక్ష ఎకరాలకు నీళ్లు అందలేదు: రేవంత్ రెడ్డి

మహదేవపూర్‌: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. లక్ష ఎకరాలకు కూడా నీరు అందించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లను, ప్రాజెక్టును మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. గతేడాది అక్టోబరు 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.  


సమీక్ష, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరువాత సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు రూపాయలు ఖర్చుపెట్టినా.. కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని ఆరోపించారు. కానీ మాజీ సీఎం కేసీఆర్‌ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చెప్పినా.. కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. సమస్య తెలిసినా, చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ప్రాజెక్టు ద్వారా సాగునీరు వచ్చిందో లేదో కానీ, ఏటా విద్యుత్‌ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయని సెటైర్లు వేశారు. ప్రాజెక్టు సంబంధిత రుణాలు, ఇతర ఖర్చులతో కాళేశ్వరానికి ఏటా రూ.25వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. 


 

మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నీటిపారుదలశాఖ అధికారులు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన 21వ పిల్లర్, ప్రాజెక్టును రేవంత్ టీమ్ పరిశీలించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు కాళేశ్వరం ప్రాజెక్టుతో తేలిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy At Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన పిల్లర్లను పరిశీలించిన సీఎం రేవంత్ టీమ్

Medigadda Barrage: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలనకు బస్సుల్లో వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిపోయిన 21వ పిల్లర్ ను సీఎం రేవంత్ టీమ్ పరిశీలించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు, పిల్లర్లకు పగుళ్లను నేతలు పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ స్థాయిలో వైఫల్యం కనిపిస్తోందని సీఎం రేవంత్, మంత్రులు, ఇతర నేతలు భావిస్తున్నారు. మరికాసేపట్లో మేడిగడ్డ బ్యారేజీ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 

మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

పది లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శామీర్ పేట తహసీల్దార్ 

శామీర్ పేట తహసీల్దార్ పదిలక్షల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు చిక్కాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు... ఆయన్ని ఆయన డ్రైవర్‌ను అరెస్టు చేశారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు డ్రైవర్ బద్రి డబ్బులు తీసుకున్నాడు. అందుకే ఇద్దరినీ అరెస్టు చేశారు. 

హర్యానాలోని శంభు సరిహద్దులో పరిస్థితి ఎలా ఉందంటే?

శంభు సరిహద్దు వద్ద రైతుల ఆందోళన అదుపు తప్పినట్లు సమాచారం. వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి, అనంతరం వారిని తరిమికొట్టడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది. కాగా, అల్లర్ల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీలోని సింఘు సరిహద్దును పూర్తిగా మూసివేసినట్లు వార్తలు వచ్చాయి.

ఎర్రకోటను తాత్కాలికంగా మూసివేసిన ఏఎస్ఐ అధికారి

రైతుల ఆందోళన దృష్ట్యా ఢిల్లీలోని ఎర్రకోటను సందర్శకుల కోసం తాత్కాలికంగా మూసివేశారు. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అధికారి ఒకరు మంగళవారం మధ్యాహ్నం ఈ విషయాన్ని వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా - మేడిగడ్డ సందర్శనకు సీఎం, మంత్రులు

తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. అనంతరం మేడిగడ్డ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు. సాయంత్రం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శంచి కుంగిన బ్రిడ్జి, పిల్లర్లు పరిశీలించనున్నారు. అనంతరం అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ మీడియా సమావేశంలో నిర్వహిస్తారు. రాత్రి 9:30 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

'అసలు ప్రాజెక్టుల వద్ద ఏం జరిగింది?' - వాస్తవాలు తెలుసుకునేందుకే మేడిగడ్డ సందర్శన అన్న సీఎం రేవంత్ రెడ్డి

సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాల అంశానికి సంబంధించి మంగళవారం కూడా అసెంబ్లీలో వాదోపవాదనలు సాగుతున్నాయి. ప్రాజెక్ట్ రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇసుక కదిలితే ప్రాజెక్ట్ కుంగింది అంటూ అప్పటి ప్రభుత్వం చెప్పిందని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై సోమవారం చర్చించి వాస్తవాలు చెప్పాం. అప్పట్లో ప్రాజెక్టుల వద్దకు ఎవరినీ వెళ్లకుండా పోలీసులను పెట్టి అడ్డుకున్నారని అన్నారు. అసలు, ప్రాజెక్టుల వద్ద ఏం జరిగిందో అందరికీ పూర్తి అవగాహన ఉండాలనే మేడిగడ్డ సందర్శనకు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. 

Background

Latest Telugu breaking News: కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ(Medigadda) బ్యారేజీ నిర్మాణ లోపాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేరుగా పరిశీలించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరనున్న ఎమ్మెల్యేల బృందం...మధ్యాహ్నం మూడున్నరకు  బ్యారేజీ వద్దకు చేరుకోనుంది.  బ్యారేజీలో నిర్మాణ లోపాలు, కుంగుబాటుకు కారణాలను అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున రావడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మరింత అప్రమత్తమయ్యారు


లోపాలు పరిశీలన
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోభాగంగా నిర్మించిన మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్ట్ దెబ్బతిన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల బృందం సందర్శించనుంది.  ఉదయం పదిన్నరకు  హైదరాబాద్(Hyderabad) నుంచి ప్రత్యేక బసుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు బయలుదేరనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసే సీఎం రేవంత్ రెడ్డి(Revanth Redy) కూడా బస్సులోనే వెళ్లనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం మేడిగడ్డ బ్యారెజీ వద్దకు చేరుకోనున్న  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బతిన్న పిల్లర్లు, కుంగుబాటుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. వ్యూ పాయింట్ నుంచి నదిలోకి వెళ్లేందుకు అనువుగా  అధికారులు ప్రత్యేకంగా రోడ్డు ఏర్పాటు చేశారు.  అనంతరం అక్కడే ప్రజల సమక్షంలోనే అధికారులు  బ్యారేజీ దెబ్బతినడానికి  కారణాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth ReddY)కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించనున్నారు. సాయంత్రం ఆరుగంటల వరకు వారు మేడిగడ్డ(Medigadda) బ్యారేజీ వద్దే ఉండనున్నారు. అనంతరం 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.  ఆ తర్వాత సీఎం సహా ఎమ్మెల్యేల బృందం తిరిగి హైదరాబాద్ బయలుదేరనుంది.


కట్టుదిట్టమైన భద్రత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా  మేడిగడ్డ(Medigadda) సందర్శనకు రానుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతం చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండటంతో మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి , మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే మార్గంలో కల్వర్లులు, రహదారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తుండటంతో  పెద్దెఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అదనపు బలగాలను  మోహరించారు. స్పెషల్ పోలీసులు అటవీప్రాంతంలోని గ్రామాలను జల్లెడపడుతున్నారు. 


కేసీఆర్ రావాలి
కాళేశ్వరం ఆర్కిటెక్ట్ కేసీఆర్(KCR) మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వచ్చి కుంగుబాటుకు కారణాలు తెలపాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంజినీర్లను పని చేయనీయకుండా  అన్నీ తాను చెప్పినట్లే చేయాలని కేసీఆర్ చెప్పడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఈదుస్థితి పట్టిందన్నారు.ప్రజల సొమ్ము దోచుకునేందుక ఇష్టానుసారం డిజైన్లు మార్చడమే గాక....ప్రాజెక్ట్ నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుందని  విమర్శించారు. దీనిఫలితంగానే  ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ సందర్శనపై బీఆర్ఎస్(BRS) తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రభుత్వం ప్రాజెక్ట్ లపై దండయాత్ర ప్రారంభించిందని మండిపడింది. చిన్న చిన్న లోపాలు సరిదిద్దాల్సిందిపోయి..మొత్తం ప్రాజెక్ట్ నే నిలిపివేసే ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.