Bomb High Court Bomb Threat:


బాంబే హైకోర్టుకి బెదిరింపు కాల్..


బాంబే హై కోర్టుకి బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో పోలీసులు పరుగులు పెట్టారు. ఔరంగాబాద్‌ బెంచ్‌ బిల్డింగ్‌లో బాంబ్ పెట్టామంటూ ఓ వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు తనిఖీలు చేశారు. చివరకు అది ప్రాంక్‌ కాల్ అని తేల్చేశారు. మంగళవారం సాయంత్రం బిహార్‌ నుంచి ఓ కాలర్ ఔరంగాబాద్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేశాడు. "నేను ఎంతో డబ్బు ఖర్చు చేశాను. కానీ నా పని అవడం లేదు. అందుకే హైకోర్టులో బాంబు పెట్టాను" అని ఆ కాలర్ బెదిరించాడు. పుండాలిక్ నగర్ పోలీస్‌ స్టేషన్‌ నుంచి స్పెషల్ టీమ్స్ వెంటనే హైకోర్టుకు పరుగులు పెట్టాయి. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌ కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుంది. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన తరవాత అనుమానాస్పద వస్తువులు ఏమీ కనిపించలేదని తేల్చి చెప్పారు. ఎవరో కావాలనే ఆట పట్టించేందుకు ఇలా కాల్ చేశారని వెల్లడించారు. దీనిపై ఇప్పటి వరకూ కేసు కూడా నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. 


గూగుల్‌కి కూడా..


ఇటీవలే పుణేలోని గూగుల్ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబులతో పేల్చేస్తామంటూ ఓ ఆగంతకుడు కాల్ చేసి బెదిరించాడు. గూగుల్ ఆఫీస్‌కు కాల్ చేసి బాంబ్ పెట్టాం అని హెచ్చరించాడు. వెంటనే యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ముంబయి పోలీసులు, పుణె పోలీసులు దీనిపై విచారణ మొదలు పెట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...ఆ కాలర్ తన పేరు పనయం శివానంద్‌గా చెప్పాడు. అంతే కాదు. తాను హైదరాబాద్‌లో ఉంటాననీ అన్నాడని గూగుల్ యాజమాన్యం వివరించింది. ల్యాండ్‌లైన్‌కు కాల్ చేసి ఇలా బెదిరించినట్టు వెల్లడించింది. ఈ సమాచారాన్నంతా ముంబయి పోలీసులు పుణె పోలీసులకు అందించారు. అయితే...ఆఫీస్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గాలించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వెంటనే ముంబయికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేశాడన్నది మాత్రం ఇంకా తేలలేదు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామని పోలీసులు తెలిపారు. 


NIAకి బెదిరింపు కాల్స్..


ముంబయిలో మరో ఉగ్రదాడికి కుట్ర జరగనున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. NIAకి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన వెంటనే... ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులతో పాటు మిగతా దర్యాప్తు సంస్థలూ దీనిపై విచారణ చేపడుతున్నాయి. NIA మెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తి తనను తాను "తాలిబన్‌"గా చెప్పుకున్నాడు. సిరాజుద్దీన్ హక్కానీ ఆదేశాల మేరకుముంబయిలో మరోసారి ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్టు బెదిరించాడు. తాలిబన్ ఆర్గనైజేషన్‌లో కీలక వ్యక్తి...సిరాజుద్దీన్. అయితే...ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో అని విచారిస్తున్నారు పోలీసులు. ముంబయిలోనే కాకుండా...దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ భద్రత పెంచారు. అత్యంత ప్రమాదకరమైన తాలిబన్ గ్రూప్‌ హెడ్‌ సిరాజుద్దీన్‌ది చాలా పెద్ద నెట్‌వర్క్. తాలిబన్‌లలో నెంబర్ 2 పొజిషన్‌ ఇతనిదే. హక్కానీ జాడ చెప్పిన వాళ్లకు అమెరికా 10 మిలియన్ డాలర్ల నజరానా ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. 


Also Read: UK Sales Director: బట్టతల ఉందని ఉద్యోగంలో నుంచి తీసేసిన కంపెనీ, రివెంజ్ తీర్చుకున్న ఎంప్లాయ్