వైఎస్సార్‌ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళ పల్లెలో JSW స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ చేశారు. సున్నపురాళ్లపల్లి గ్రామం ఇందుకు వేదిక అయింది. అనంతరం స్టీల్‌ప్లాంట్‌ నమూనాను సీఎం పరిశీలించారు. అనంతరం స్టీల్‌ ప్లాంట్‌ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకున్నారు.


జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌ సంస్థ స్టీల్‌ ప్లాంట్‌‌ను నిర్మించనుంది. కడపలో తొలి విడతగా రూ.3,300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు సున్నపురాళ్లపల్లి గ్రామం వద్ద భూమి పూజ చేశారు. ఈ స్టీల్ ప్లాంటు నిర్మాణం జరిగి అందుబాటులోకి వస్తే నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మందికి జీవనోపాధి లభించనుంది. కడప గడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించాలని విభజన చట్టంలో పొందుపర్చిన సంగతి తెలిసిందే.


గతంలోనే రెండుసార్లు శంకుస్థాపనలు
ఈ స్టీలు ప్లాంటు నిర్మాణానికి చంద్రబాబు ఓసారి శంకుస్థాపన చేయగా, అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ కూడా రెండోసారి శంకుస్థాపన చేశారు. 2019 డిసెంబర్‌ 23న స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ నిర్వహణకు సన్నాహాలు చేశారు. కానీ, 2020 ఫిబ్రవరి నుంచి మొదలైన కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచమే అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగడం వల్ల ప్లాంటు నిర్మాణం మొదలుకాలేదు. 


దీంతో ఇప్పుడు జేఎస్‌డబ్ల్యు సంస్థ రంగంలోకి దిగింది. తాజాగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గత డిసెంబర్‌లో కడప జిల్లా పర్యటన సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌ ద్వారా జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు జీఓ ఎంఎస్‌ నంబర్‌ 751 ద్వారా ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ 2022 డిసెంబర్‌ 16న ఉత్తర్వులు జారీ చేశారు. తొలి విడతలో ఏడాదికి 1 మిలియన్‌ టన్నులు (10 లక్షల టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ రెడీ అయింది.


అందుకోసం ఫేజ్‌–1లో రూ.3,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. వచ్చే 36 నెలల కాలంలో మొదటి విడత పనులు పూర్తి కానున్నట్లుగా సంస్థ ప్రకటించింది. తొలి విడత ప్లాంట్‌లో వైర్‌ రాడ్స్, బార్‌ మిల్స్‌ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. మరో రూ.5,500 కోట్లతో రెండో విడత ఫేజ్‌–2 నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించారు. ఫేజ్‌–2 కూడా మార్చి 31, 2029 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్లాంటుకు మౌలిక వసతులు కల్పించేందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.720 కోట్లు ఖర్చు చేస్తోంది. 


ఆ ప్రాంతానికి ఈ మౌలిక సౌకర్యాల కల్పన
నాలుగులేన్ల రహదారి, రైల్వే కనెక్టివిటీ, నీటి వసతి కోసం పైపు లైన్‌లు ఏర్పాటు చేయడం, నిల్వ చేసుకునేందుకు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు, విద్యుత్‌ సౌకర్యం, కాంపౌండ్‌ వాల్, భవన సముదాయం నిర్మించనున్నారు. అందులో భాగంగా ఎన్‌హెచ్‌–67 నుంచి ముద్దనూరు నుంచి జమ్మలమడుగు రోడ్డుకు అనుసంధానంగా రూ.145.3 కోట్ల తో 12 కిలోమీటర్లు నాలుగు లేన్ల రహదారి ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరు రైల్వేలైన్‌ నుంచి రూ.323.5 కోట్లతో 9.4 కిలో మీటర్లు నిర్మాణం చేపట్టనున్నారు. 


నీరు ఇలా
మైలవరం జలాశయం నుంచి 2 టీఎంసీల నీరు సరఫరా చేయనున్నారు. అందుకోసం 15 కిలోమీటర్లు పైపులైన్‌ నిర్మించనున్నారు. ఇప్పటికే విద్యుత్‌ సరఫరాకు కావాల్సిన చర్యలు పూర్తి అయ్యాయి. రూ.76.42 కోట్లతో 27 కిలోమీటర్ల మేరకు విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు, 33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తయింది. 20 లక్షల లీటర్ల సామర్థ్యం కల్గిన సంప్‌ నిర్మాణం పూర్తయింది. ప్రహరీ,  భవన సముదాయం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.