Srisailam Brahmothsavalu: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున ఛైర్మన్ సతీమణి స్వర్ణలత రెడ్డి, జేఈవో వీర బ్రహ్మం దంపతులు, తిరుమల దేవస్థానం వేదపండితులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సతీమణి స్వర్ణలతా రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, తిరుమల దేవస్థానం వేదపండితులకు... శ్రీశైలం ఆలయ ఈవో ఎస్.లవన్న, చైర్మన్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలు సమర్పించారు.




ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు..


అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న, చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సతీమణి స్వర్ణలతారె డ్డికి, జేఈవో వీరబ్రహ్మం దంపతులకు శ్రీశైలం శ్రీ స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం లడ్డు ప్రసాదాలను అందించగా అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనలిచ్చి దీవించారు. మరోవైపు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగో రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామివారు మయూర వాహనాదీశులై భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీప కాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు.


ఘనంగా గ్రామోత్సవం - పాల్గొన్న వేలాదిమంది భక్తులు


అనంతరం శ్రీస్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండువగా గ్రామోత్సవానికి తరలి వెళ్లారు. రాజగోపురం గుండా మయూర వాహనాదీశులైన శ్రీస్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో ఊరేగించారు. మయూర వాహానంపై స్వామి అమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు. కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆట పాటలు, నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మయూర వాహన సేవ పూజ కైంకర్యాలలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సతీమణి స్వర్ణలత రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు.


బ్రహ్మోత్సవాల రెండో రోజు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి


శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారికి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈఓ లవన్న తమ వ్యక్తిగతంగా శ్రీస్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ ( AP Minister Kottu Satyanarayana) దంపతులకు దేవస్థానం అధికారులకు శ్రీశైలం ఆలయ ఈవో లవన్న చైర్మన్ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆదివారం జరిగే బృంగి వాహన సేవ ( Brungi Vahana Seva )లో మంత్రి దంపతులు పాల్గొన్నారు.