పర్యటకుల భద్రతను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. పర్యటక ప్రదేశాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడే జరిగే నేరాలను ఆపవచ్చని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 ​టూరిస్ట్ పోలీస్ స్టేషన్‌లను నేడు (ఫిబ్రవరి 14) ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ పోలీస్ స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో టూరిస్టుల భద్రత కోసం ఇంకో మంచి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.


ఈ సందర్భంగా పోలీస్‌ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. దేశంలోనే మొదటి సారిగా టూరిస్ట్‌ పోలీస్ స్టేషన్ లు ప్రారంభించామని జగన్ చెప్పారు. పర్యటకుల భద్రత కోసమే టూరిస్ట్ పీఎస్‌లు తీసుకొచ్చామని స్థానిక పోలీస్‌ స్టేషన్లకు ఇవి అనుసంధానంగా పని చేస్తాయని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. పోలీసులు కూడా ప్రజల స్నేహితులే అనే భావనను జనాల్లో తీసుకువచ్చామని అన్నారు. పోలీస్‌ స్టేషన్ లో రిసెప్షనిస్టులను పెట్టి సాయంగా నిలిచే కార్యక్రమం చేపట్టామని అన్నారు. పర్యటకుల భద్రత కోసమే ఈ టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభించినట్లు తెలిపారు. యాత్రికులు నిర్భయంగా పర్యటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్‌ స్టేషన్లు ఉపయోగపడతాయని అన్నారు.