పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్ల సంస్థ ఇజ్రాయెల్‌పై దాడులకు దిగడంతో ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య యుద్ధం జరుగుతోంది. హమాస్‌ దాడులను తిప్పి కొట్టేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం కూడా గాజా స్ట్రిప్‌పై దాడులు చేపడుతోంది. ఈ నేపథ్యంలో గాజా ప్రాంతంలో హమాస్‌ సంస్థకు చెందిన 1500 మంది మృతదేహాలు లభ్యమైనట్లు ఇజ్రాయెల్‌ సైన్యం మంగళవారం వెల్లడించింది. హమాస్‌ స్థావరాలపై ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులు చేసి వాటిని నాశనం చేసింది. దీంతో పలువురు మిలిటెంట్లు హతమయ్యారు. గాజా సరిహద్దులో తమ భద్రతా దళాలు దాదాపుగా నియంత్రణ సాధించినట్లు మిలిటరీ అధికార ప్రతినిధి రిచర్డ్‌ హెచ్‌ వెల్లడించారు. గత రాత్రి నుంచి సరిహద్దు నుంచి ఎవ్వరూ లోపలికి రాలేదని, కానీ ఇంకా చొరబాట్లు జరుగుతూ ఉంటాయని తెలిపారు.


హమాస్‌ ఉగ్రవాదులు శనివారం ఉదయం సరిహద్దు కంచె నుంచి ఇజ్రాయెల్‌ లోపలికి ప్రవేశించి ఘోరమైన దాడులకు పాల్పడ్డారు. ఉదయం కేవలం వేలాది రాకెట్లు ప్రయోగించి మెరుపు దాడులతో అల్లకల్లోలం చేశారు. ఇళ్లలోకి చొరబడి పౌరులను కాల్చేశారని, రోడ్లపై కనిపించిన వారిపై కాల్పులు జరిపారని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. అయితే ఇజ్రాయెల్‌ కూడా ప్రతి దాడిగా గాజా స్ట్రిప్‌పై భీకర దాడులు చేపట్టింది. దీంతో అటువైపు కూడా తీవ్రగా ప్రాణ నష్టం జరుగుతోంది. ఇజ్రాయెల్‌ వైపు ఇప్పటిదాకా 900 మంది మరణించారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. 


హమాస్‌ చేస్తున్న దాడుల పట్ల ఇజ్రాయెల్‌ ప్రధాని నేతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఆయన హమాస్‌కు గట్టి హెచ్చరిక చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికి 3 లక్షల మంది సైనికులను సమీకరించిందని చెప్పారు. ఇజ్రాయెల్‌ ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు, కానీ ఇజ్రాయెల్‌ దీనిని పూర్తి చేస్తుందని అన్నారు.  తాము ఈ యుద్ధాన్ని కోరుకోలేదు కానీ అత్యంత క్రూరమైన రీతిలో బలవంతంగా దీనిని ప్రారంభించారని చెప్పారు. తమపై దాడి చేయడం అతి పెద్ద చారిత్రాత్మక తప్పిదం అని హమాస్‌ త్వరలోనే అర్థం చేసుకుంటుందని అన్నారు. రాబోయే దశాబ్దాల పాటు ఇజ్రాయెల్‌ శత్రుదేశాలకు గుర్తుండిపోయేలా తాము హమాస్‌కు సమాధానం చెప్తామని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆయన హమాస్‌ను ఐసిస్‌ తరహా సంస్థగా పేర్కొన్నారు.


ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఐరాస ప్రజల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌ చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలు తాము గుర్తించామని, అయితే సైనిక కార్యకలాపాలు అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగా ఉండాలని ఇజ్రాయెల్‌కు గుర్తు చేస్తున్నట్లు యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ అన్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ దాడుల నేపథ్యంలో అమెరికా, యూకే, జర్మనీ, భారత్‌ సహా పలు దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తున్నాయి. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్‌ సహాయం కోసం యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు పంపించింది. కాగా సౌదీ అరేబియా పాలస్తీనాకు మద్దతునిస్తోంది. పాలస్తీనా ప్రజలకు తమ మద్దతు ఉంటుందని సౌదీ యువరాజు ప్రకటించారు.  ఇజ్రాయెల్‌-హమాస్‌ దాడిలో 11 మంది అమెరికన్లు మరణించినట్లు యూఎస్‌ ధృవీకరించింది. మరికొంత మంది బందీలుగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తంచేస్తోంది. అయితే యుద్ధంలో సైనికంగా పాల్గొనే ఉద్దేశం లేదని అమెరికా తెలిపింది. అయితే ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోంది. ఇరాన్‌ ఇతర దేశాలు ఇందులో జోక్యం చేసుకోవద్దని అమెరికా హెచ్చరిస్తోంది.