స్కిల్ స్కాం కేసులో అరెస్టైన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో చంద్రబాబు ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను సోమవారం కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే, తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేయగా ఊరట దక్కలేదు. మరోవైపు, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైనా సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు కొనసాగుతున్నాయి.
భిన్న వాదనలు
చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. నోటీసులు జారీ చేయాలన్ని రోహత్గీ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. ఈ క్రమంలో ఇరు పక్క్షాల న్యాయవాదులు సుప్రీంకోర్టు విధి విధానాలను సర్వోన్నత న్యాయస్థానం ముందుంచారు. నోటీసులు ఇస్తారా అనే విషయాన్ని బెంచ్ తేల్చాలని రోహత్గీ కోరారు.
సాల్వే ఏం చెప్పారంటే.?
ఈ కేసులో కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్ల అవసరం ఉండదని జస్టిస్ బేలా ఎం.త్రివేది అన్నారు. క్రిమినల్ కేసుల్లో మళ్లీ కౌంటర్ అఫిడవిట్ల అవసరం ఏంటని సాల్వే ప్రశ్నించారు. నోటీసులు కోర్టు విధానాల్లో భాగమని రోహత్గీ వాదించగా, నోటీసులు అవసరం లేదన్న దానిపై ఆధారాలేమైనా ఉన్నాయా.? అని సాల్వేను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ గతంలో తీర్పును బెంచ్ ముందుంచుతానని సాల్వే చెప్పారు. ఈ సందర్భంగా 17ఏ చట్ట పరిధిలోని పలు అంశాలను సాల్వే న్యాయస్థానం ముందుంచారు.
'కేసు మూలంలోనే దోషం'
స్కిల్ స్కాం కేసు మూలంలోనే తప్పు ఉందని హరీష్ సాల్వే పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల హైకోర్టు తీర్పులను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, సుప్రీంకోర్టులో తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదన్నారు. కాగా, ఈ పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరని సాల్వే వాదించారు. ఈ క్రమంలో 2011లో దేవిందర్ పాల్ సింగ్ బుల్లర్ కేసును ప్రస్తావించారు. స్కిల్ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదని, దాన్నే సవాల్ చేస్తున్నట్లు వివరించారు. అన్నీ కలిపేసి ఒక ఎఫ్ఐఆర్ ను రూపొందించారని, అందులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదని సాల్వే తెలిపారు.
'రాజకీయ కక్ష లేదు'
స్కిల్ స్కాం కేసులో 2018 పీసీ చట్ట సవరణకు ముందే నేరం జరిగిందని సీఐడీ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. చంద్రబాబుపై తగినన్న ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ కేసు విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలన్నారు. చట్ట సవరణకు ముందున్న నేరం కాబట్టే 17ఏ వర్తించదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష లేదని రోహత్గీ పేర్కొన్నారు. పిటిషనర్ అరెస్టైన కొన్ని రోజుల్లోనే కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. విచారణ ప్రారంభం కాక ముందే కేసు కొట్టేయాలనే ఆలోచనతో ఈ పిటిషన్ వేశారని చెప్పారు.