Blue Corner Notice to Prajwal Revanna: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణకి blue-corner notice జారీ చేసినట్టు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర వెల్లడించారు. ఆయనపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి సహకరిస్తుందని తేల్చి చెప్పారు. పారదర్శకంగానే (Prajwal Revanna) విచారణ జరుగుతుందని, ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలైనట్టు వివరించారు. అయితే...ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయినట్టు ఇప్పటికే సమాచారం అందింది. అందుకే..ఆయనకు బ్లూ కార్నర్ నోటీస్‌లు ఇచ్చిన పరమేశ్వర తెలిపారు.
"ప్రజ్వల్ రేవణ్ణకి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన మాట నిజమే. సంబంధిత అధికారులు ఆయనను త్వరలోనే పట్టుకుంటారు. వీలైనంత త్వరగా ఆయనను విదేశాల నుంచి భారత్‌కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్ని ప్రొసీజర్స్‌ని అనుసరిస్తోంది. పద్ధతి ప్రకారమే ఆయనను దేశానికి రప్పిస్తుంది"
- జి పరమేశ్వర, కర్ణాటక హోం మంత్రి
హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్..
ఇప్పటికే ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణని పోలీసులు అరెస్ట్ చేశారు. పని మనిషి కిడ్నాప్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. బాధితురాలి కొడుకు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో ఐదేళ్ల పాటు పని చేసిన మహిళ తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుందన్న భయంతో కిడ్నాప్ చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. హెచ్‌డీ రేవణ్ణ సన్నిహితుడు ఆ మహిళను కార్ ఎక్కించుకుని ఆ తరవాత ఇంటికి తీసుకురాలేదని ఆమె కొడుకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రేవణ్ణని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉండగానే ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ఈ అంశం పెద్ద దుమారమే రేపుతోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇలాంటి పరిణామాలు జరుగుతుండడం కీలకంగా మారింది. ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణకి బ్లూ కార్నర్ నోటీస్ ఇవ్వడం ఇంకాస్త అలజడి పెంచింది.
ఏంటీ బ్లూ కార్నర్ నోటీస్..?
Interpol వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం...బ్లూ కార్నర్ నోటీస్ (What is Blue Corner Notice) అంటే ఓ నేరస్థుడికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడం. ఓ నేరస్థుడు వేరే దేశానికి పారిపోయినప్పుడు అక్కడి పోలీసులు ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. కానీ బ్లూ కార్నర్ నోటీస్ లేకుండా ఆ వివరాలు ఇవ్వడానికి వీల్లేదు. ఒక్కసారి ఈ నోటీస్ జారీ అయితే అందుకు అనుమతి లభిస్తుంది. CBI ఈ బ్లూ కార్నర్ నోటీస్‌లనే B Series Notices గా పిలుస్తుంది. వీటినే enquiry notices గానూ పరిగణిస్తారు. తప్పించుకుని పారిపోయిన వ్యక్తి ఆచూకీ కనుగొనేందుకు స్థానిక పోలీసులు సహకరించడం ఇందులో భాగమే. ఉదాహరణకు 2020లో నిత్యానంద ఆచూకీని కనిపెట్టేందుకు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. గుజరాత్ పోలీసుల విజ్ఞప్తి మేరకు ఈ నోటీస్ ఇచ్చింది.
Also Read: Nepal Currecy Note: భారత్ భూభాగంలోని ప్రాంతాలతో నేపాల్ కరెన్సీ నోటు, స్పందించిన జైశంకర్