Nepal Currency Row: నేపాల్ కొత్తగా తీసుకొచ్చిన రూ.100 కరెన్సీ నోటు భారత్, నేపాల్ మధ్య కొత్త (Nepal New Currency Note) వివాదానికి దారి తీసింది. ఆ నోటుపై ఉన్న నేపాల్ మ్యాప్‌లో కొన్ని భారత్ భూభాగంలోని ప్రాంతాలూ ఉన్నాయి. మూడు వివాదాస్పద ప్రాంతాలు తమవే అన్నట్టుగా మ్యాప్‌లో కలిపేసుకుంది నేపాల్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక మైత్రిపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్న చర్చ మొదలైంది. ఈ మ్యాప్ ద్వారా (Lipulekh) లిపులేఖ్, లింపియదుర, కాలాపనీ ప్రాంతాలు తమ భూభాగంలోనివే అని పరోక్షంగా నేపాల్ తేల్చి చెప్పింది. నేపాల్ ప్రధాని పుష్పకమల్ ప్రచండ నేతృత్వంలో కేబినేట్ మీటింగ్ జరగ్గా..అందులోనే ఈ కరెన్సీ నోటు ముద్రణకు ఆమోదం తెలిపారు. పాత మ్యాప్ స్థానంలో ఈ కొత్త మ్యాప్‌ని ప్రింట్ చేసేందుకు అంగీకరించారు. నిజానికి 2020 జూన్‌లోనే నేపాల్ తమ దేశ మ్యాప్‌లో మార్పులు చేర్పులు చేసింది. అందులో భాగంగానే లిపులేఖ్, కాలాపానీ సహా లింపియదుర ప్రాంతాలను తమ టెరిటరీలో కలుపుకుంది. అలా కొత్త మ్యాప్‌ని ప్రింట్ చేయించింది. దీనిపై అప్పుడే భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యని ఖండించింది. అయితే...ఇప్పుడు ఏకంగా కరెన్సీ నోటుపైనా ప్రింట్ చేయడం సంచలనమైంది. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని అనవసరంగా చెడగొట్టద్దు అని తేల్చి చెప్పారు. అయితే...ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవని, ఏదేమైనా నిజాన్ని మాత్రం మార్చలేరని స్పష్టం చేశారు.
"ఈ సమాచారం నాకు తెలిసింది. పూర్తి వివరాలు మాత్రం తెలియలేదు. కానీ ఈ విషయంలో భారత్ స్టాండ్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. సరిహద్దు వివాదాలపై నేపాల్‌తో చర్చలు జరుగుతున్నాయి. చర్చల మధ్యలో ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోడం సరికాదు. ఇలాంటివి చేయడం ద్వారా నిజాలను మార్చలేరు"
- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
2020లో ఎప్పుడైతే నేపాల్ మ్యాప్ అప్‌డేట్ అయిందో అప్పటి నుంచే రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. అన్ని కొలతలు తీసుకున్న తరవాతే అవి తమ దేశంలో భాగమే అని గుర్తించామని నేపాల్ వాదిస్తోంది. 2020లో మే నెలలో కైలాశ్ మానససరోవర్‌కి లిపులేఖ్ మీదుగా రోడ్‌ని భారత్ నిర్మించడాన్ని నేపాల్ తప్పుబట్టింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది.
Also Read: Gaza News: గాజా నుంచి వెళ్లిపోండి, లేకపోతే యుద్ధం ఆపే ప్రసక్తే లేదు - ఇజ్రాయేల్‌కి హమాస్ హెచ్చరిక