Israel Gaza War: ఇజ్రాయేల్ హమాస్‌ యుద్ధం (Israel Hamas War) తీవ్రతరం కాకుండా అమెరికా సహా ఖతార్, ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా అవేమీ ఫలించడం లేదు. ఇజ్రాయేల్, హమాస్ పరస్పరం హెచ్చరికలు చేసుకుంటున్నాయి. యుద్ధం ఆపేలా ఒప్పందం కుదుర్చుకుంటే వదిలేస్తామని ఇజ్రాయేల్‌ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. కానీ అందుకు హమాస్ అంగీకరించినట్టుగా లేదు. కండీషన్స్‌ పెట్టి మరీ వార్నింగ్ ఇస్తోంది. గాజాపై ఇజ్రాయేల్ యుద్ధం కొనసాగిస్తుండగానే తాము డీల్‌కి ఎలా (Truce Deal) ఒప్పుకుంటామని ప్రశ్నించింది. పూర్తిగా ఇజ్రాయేల్ వెనక్కి తగ్గేంత వరకూ ఒప్పందానికి ముందుకు వచ్చేదే లేదని తేల్చి చెప్పింది. ఇదే క్రమంలో ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పైనా మండి పడుతోంది. ఈజిప్ట్ రాజధాని కైరోలో హమాస్ ప్రతినిధి ఖతార్, ఈజిప్ట్, అమెరికా మధ్యవర్తులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగానే హమాస్ ఈ వ్యాఖ్యలు చేసింది. AFP న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం...హమాస్ ప్రతినిధి ఓ విషయాన్ని తేల్చి చెప్పారు. గాజాలో ఇజ్రాయేల్ సైన్యాన్ని ఉపసంహరించుకునేంత వరకూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అక్కడ సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తేనే యుద్ధం ముగిసినట్టుగా భావిస్తామని వెల్లడించారు. అయితే...ఆ హమాస్ ప్రతినిధి  పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు. యుద్ధాన్ని ఆపేసే ఉద్దేశం లేకుండా కేవలం రఫాపై దాడులు ఆపేందుకే ఒప్పందం కుదుర్చుకుంటామంటే అందుకు హమాస్ అంగీకరించదని ఆ ప్రతినిధి తేల్చి చెప్పినట్టు AFP న్యూస్ వెల్లడించింది. 


శరణార్థుల సంగతేంటి..?


హమాస్ ప్రతినిధి కండీషన్స్‌పై ఇజ్రాయేల్ అధికారులు స్పందించారు. డీల్ కుదుర్చుకునే ఇష్టం లేకే ఇలాంటి సాకులు చెబుతున్నారని మండి పడ్డారు. యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక ఈ యుద్ధంతో విసిగిపోయిన ఇజ్రాయేల్ పౌరులు నెతన్యాహుకి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా ఏదో ఓ ఒప్పందం కుదుర్చుకుని యుద్ధాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. గాజా నుంచి వలస వెళ్లిపోయిన ఇజ్రాయేల్ శరణార్థుల్ని వెనక్కి రప్పించాలని చెబుతున్నారు. ఆందోళనలు చేస్తున్న వాళ్లలో శరణార్థుల కుటుంబ సభ్యులున్నారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై హమాస్ దాడులతో మొదలైన ఈ యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతోంది. హమాస్ దాడులతో 1,200 మంది ఇజ్రాయేల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరవాత ఇజ్రాయేల్ ఎదురు దాడికి దిగింది. గాజా స్ట్రిప్‌పై దాడులు మొదలు పెట్టడం వల్ల ఆ ప్రాంతంలోని 34 వేల మంది పౌరులు బలి అయ్యారు. ఈ శరణార్థులను అప్పగించే విషయంలోనూ ఇంకా సయోధ్య కుదరడం లేదు. హమాస్ వద్ద ప్రస్తుతానికి 128 మంది ఇజ్రాయేల్ శరణార్థులున్నారు. వాళ్లలో ముందుగా 33 మందిని అప్పగించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఆ తరవాత విడతల వారీగా వాళ్లందరినీ అప్పగించే అవకాశాలున్నాయి. అయితే..ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు అమెరికా మాత్రం యుద్ధ తీవ్రతని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈజిప్ట్ కూడా జోక్యం చేసుకుంటోంది. 


Also Read: Viral News: ప్యాంట్‌లో పాములు పెట్టుకుని స్మగ్లింగ్, అవాక్కైన ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది