Adilabad News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు కాంగ్రెస్ బిజెపి అగ్ర నేతలు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగజ్ నగర్ లో బిజెపి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తరఫున ప్రచారంలో భాగంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్రమంత్రి అమిత్ షా చేరుకుని సభలో ప్రసంగించనున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపొందడం ఆ ప్రాంతంలో పట్టు కోసం పార్లమెంటు ఎన్నికల్లోను అక్కడే అమిత్ షా తో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో కలిసి వస్తుందని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 


కొమరం భీం జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ రెండు నియోజకవర్గాల పట్టు కోసం బిజెపి వ్యూహం రచిస్తోంది. అనుష బహిరంగ సభ నేపథ్యంలో పార్లమెంటు ఇన్చార్జి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ సభ ఏర్పాట్లను అన్ని విధాల పూర్తి చేశారు. భారీగా ఉష్ణోగ్రతలు నమోదయి 45 డిగ్రీలు దాటుతున్న తరుణంలో సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.


నిర్మల్ జిల్లాలో రాహుల్
నిర్మల్ జిల్లా కేంద్రంలో డ ఆత్రం సుగుణ తరఫున ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గోని ప్రసంగించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ నిర్మల్కు చేరుకొని సభలో పాల్గొని ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నిర్మల్ ముధోల్ రెండు నియోజకవర్గాల్లో బిజెపి బలంగా ఉంది ఈ రెండు స్థానాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కైవసం చేసుకుంది. 


పార్లమెంటు ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పుంజుకోవడం కోసం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని పార్టీలోకి చేర్చుకున్నారు. ముధోల్ నుండి విట్టల్ రెడ్డి వేణుగోపాల చారి లాంటి సీనియర్ నేతలను కూడా ఇదివరకే పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ పట్ల ఓటర్లలో సానుకూలత ఉంది. నిర్మల్, సిర్పూర్, ఖానాపూర్ నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వినియోగం సహా పంద్రాగస్టుకు రూ.2 లక్షల రుణమాఫీ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో నేతలు ఆసక్తి చూపడం లేదనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. 


ఇప్పటికే అదిలాబాద్, ఆసిఫాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం పూర్తి చేయగా ఆదివారం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్ కు రానుండటం కీలకం కానుంది. భాజపాకు కీలక అడ్డాగా ఉన్న నిర్మల్ ముధోల్ నియోజకవర్గంలో మార్పు తెచ్చేందుకే రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ సభతో ఈ ప్రాంతంలో ఏలాంటి మార్పు వస్తుందో చూడాలి.