Ktr Helped To Darshanam Mogulaiah: కిన్నెర వాయిద్యకారుడు, 'పద్మశ్రీ' అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు (Darshanam Mogulaiyya) బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆర్థిక సాయాన్ని అందించారు. మొగులయ్య ప్రస్తుతం కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారంటూ ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయనకు గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ ఆపివేయడంతో ఆయన కూలీ పని చేస్తున్నారంటూ వైరల్ అయిన వార్త పట్ల స్పందించిన కేటీఆర్ ఆయన్ను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్.. మొగులయ్యను వ్యక్తిగతంగా కలిశారు. కొంత ఆర్థిక సాయాన్ని అందించారు. ఆయనకు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ తో పాటు అన్ని రకాల హామీలను నెరవేర్చాలని కేటీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొగులయ్య వంటి జానపద కళాకారులు తెలంగాణకి గర్వకారణమని వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద్, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. కాగా, తనకు ఆర్థిక సాయం చేసినందుకు కేటీఆర్ కు కళాకారుడు మొగిలయ్య ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ సాయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.


ఇదీ జరిగింది


కాగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత  దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారు. తుర్కయాంజల్‌లో ఓ ఇంటి వద్ద పని చేస్తున్న ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయనకు 600 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.కోటి సాయం అందింది. అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా రూ.కోటి చెక్కును అందించారు. అయితే అవి తన పిల్లల పెళ్లిళ్లతో పాటు స్థలం కొనుక్కోవడానికి సరిపోయాయనని .. డబ్బులు సరిపోకపోవడంతో కడుతున్న ఇంటిని కూడా మధ్యలో నిలిపివేశానని ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. తన కుమారులకు, తనకు కూడా అనారోగ్యం ఉందని.. నెలకు మెడిసిన్స్ ఖర్చు రూ.7 వేలు అవుతోందని పేర్కొన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు ఆర్థిక సాయంతో పాటు నెలకు రూ.10 వేల ప్రత్యేక పెన్షన్ కూడా మంజూరు చేసింది. అయితే, ఆ పెన్షన్ సరిగా రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పరిస్థితిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగింది. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. 






స్పందించిన ప్రభుత్వం


అయితే, దీనిపై ప్రభుత్వం స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కవులు, కళాకారులను ఎప్పుడూ గౌరవిస్తుందని ప్రకటించింది. గుస్సాడి కనకరాజు, దర్శనం మొగులయ్యలకు పెన్షన్ ఎక్కడా ఆపలేదని.. క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు ఆధారాలతో ట్వీట్ చేసింది. కొంతమంది కావాలనే అలా ప్రచారం చేయించుకుంటున్నారని విమర్శలు చేసింది. కాగా, కొద్ది రోజుల కిందటే మొగులయ్య సీఎం రేవంత్ ను క్యాంప్ ఆఫీస్ లో కలిశారు. ఆ ఫోటోలను సైతం మీడియాకు రిలీజ్ చేశారు.









Also Read: Sun Stroke Deaths: తెలంగాణలో భానుడి ఉగ్రరూపం - వడదెబ్బకు ఒక్కరోజే 19 మంది మృతి