BJP Praveen Nettaru Murder Case: భాజపా యువ మోర్చా కార్యకర్త హత్య కేసును కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు అప్పగించారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది
భాజపా యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ (32)పై నెట్టారు ప్రాంతంలో దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రవీణ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
పౌల్ట్రీ షాప్ యజమాని అయిన ప్రవీణ్‌పై మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ హత్యకు గల కారణాలేంటి? చేసింది ఎవరు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నిరసనలు
భాజపా కార్యకర్త దారుణ హత్యను ఖండిస్తూ హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో బుధవారం సులియా, కడబ, పుత్తూరు సహా పలు తాలూకాల్లో బంద్ జరిగింది. ప్రధాన వాణిజ్య సంస్థలు, స్కూళ్లు మూతపడ్డాయి.
ప్రవీణ్ హత్యపై ఆందోళన చేపట్టిన భాజపా కార్యకర్తలు, నిరసనకారులు.. దక్షిణ కన్నడ ఎంపీ నలిన్ కుమార్ కారుపై దాడి చేశారు. కారును చుట్టుముట్టి ఊపేశారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
మరో వ్యక్తి
కర్ణాటకలో ప్రవీణ్ హత్య మరువక ముందే మరో దారుణ ఘటన జరిగింది. గురువారం సాయంత్రం మంగళూరులోని ఓ ముస్లిం యువకుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపేశారు.
సురత్కల్‌లో అప్పుడే ఓ బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చిన బాధితుడి వైపు కారులో వచ్చిన దుండగులు దూసుకొచ్చారు. భయంతో అక్కడి నుంచి బాధితుడు పరుగులు తీశాడు. అయినా కర్రలతో, కత్తులతో అతనిపై దాడికి పాల్పడ్డారు. దాడి చేసి పారిపోయిన వెంటనే బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తొలుత పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ అతను మరణించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ఈ దాడి ఘటన రికార్డు అయింది.
Also Read: Uttar Pradesh News: కట్నం ఇవ్వలేదని భార్యపై గ్యాంగ్ రేప్- తర్వాత త్రిపుల్ తలాఖ్!
Also Read: UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకబడ్డ రిషి- ఆ ఒక్క హామీ కొంప ముంచింది!