మెజార్టీ రాకపోయినా అధికారం భాజపాదే..


ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి రెండు దార్లుంటాయి. ఒకటి భారీ మెజార్టీతో గెలవటం లేదా గెలిచిన పార్టీల ఎమ్మెల్యేలకు తాయిలాలిచ్చి
మన వైపు తిప్పుకోవటం. బలం లేని చోట తెలివి ఉపయోగించాలంటారు. ఇప్పుడు ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ఇదే సిద్ధాంతాన్ని 
నమ్ముకుంటోంది. అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితిని సృష్టించి, చివరకు తమకు అనువైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ట్రెండ్‌ని చాన్నాళ్ల నుంచి ఫాలో అవుతోంది భాజపా. ప్రస్తుతం మహారాష్ట్రలో థాక్రే ప్రభుత్వం ప్రమాదంలో పడిపోయిన నేపథ్యంలో మరోసారి భాజపా ఫిరాయింపుల రాజకీయం చేస్తోందా అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. 


ఫిరాయింపుల వ్యూహంతో అధికారంలోకి..


నిజానికి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇదే వ్యూహాన్ని అనుసరించి పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది భాజపా. 2014 నుంచే ఈ స్ట్రాటెజీని అమలు చేస్తూ వచ్చింది కాషాయ పార్టీ. ఆ సంవత్సరంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికలు జరగ్గా, 60 సీట్లకు గానూ 42 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. భాజపా 11 స్థానాలకే పరిమితమైంది. రెండేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కి 2016 లో కష్టకాలం ప్రారంభమైంది. విచిత్రమేంటంటే ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్‌లో చేరారు. వాళ్లంతా భాజపా కండువా కప్పుకున్నారు. ఈ ఫిరాయింపులు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. భాజపా అక్రమంగా అధికారం సొంతం చేసుకుందంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. 


మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే స్ట్రాటెజీ


తరవాత మణిపూర్, గోవా వంతు. 2017లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాల్లో 17 చోట్ల గెలిచిన కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు కావాల్సి వచ్చింది. 13చోట్ల గెలుపొందిన భాజపా తన మార్క్ రాజకీయాలు మొదలు పెట్టింది. స్థానిక పార్టీలైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ-GMP,గోవా ఫార్వర్డ్‌ పార్టీ-GFPతో సంప్రదింపులు మొదలు పెట్టింది. నితిన్ గడ్కరీ రంగంలోకి దిగి చర్చలు జరపగా, పలువురు కాంగ్రెస్ రెబెల్స్ భాజపాతో చేయి కలిపేందుకు అంగీకరించారు. ఫలితంగా భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనోహర్ పారికర్‌ని సీఎంగా నిలబెట్టింది. 60 సీట్లున్న మణిపూర్‌లో కాంగ్రెస్ 28 చోట్ల విజయం సాధించింది. 21 స్థానాలకే పరిమితమైన భాజపా స్థానిక పార్టీలతో మంతనాలు జరిపింది. పలువురు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మాజీ కాంగ్రెస్ నేత బిరెన్ సింగ్‌ని సీఎంగా ప్రకటించింది. 


2018లో మేఘాలయలోనూ ఇదే జరిగింది. 60 స్థానాలకు గానూ 21చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా, భాజపా కేవలం రెండు సీట్లకే 
పరిమితమైంది. కిరణ్ రిజిజు, మాజీ కాంగ్రెస్ నేత హిమంత బిశ్వ శర్మను రంగంలోకి దింపి స్థానిక పార్టీలతో మంతనాలు జరిపి ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను సాధించింది భాజపా. 2018లో కర్ణాటకలో 225 స్థానాలకు గానూ 105 చోట్ల విజయం సాధించింది కాషాయ పార్టీ. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ దక్కలేదు. కాంగ్రెస్‌కు 78,జనతా దళ్‌కి 34 స్థానాలు దక్కాయి. యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బల పరీక్షలో ఓడిపోయారు. కాంగ్రెస్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని కుమారస్వామి సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తరవాత పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న భాజపా అధికారాన్నిచేజిక్కించుకుంది. ఇలా మరి కొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే వ్యూహంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది.