Atmakur Bypoll 2022 Date: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉంది. రేపు (జూన్ 23న) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కోసం అధికారులు 279 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1132 మంది పోలింగ్ సిబ్బంది, 148 మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్ క్యాస్టింగ్ సిబ్బంది ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. మూడు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలతో భారీగా భద్రత ఏర్పాటు చేశారు.
సమస్యాత్మక కేంద్రాల్లో జాగ్రత్తలు..
123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని గుర్తించిన అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచార పర్వం పూర్తయింది. అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. చెక్ పోస్ట్ ల వద్ద దాదాపు 50 లక్షల రూపాయలు సీజ్ చేశారు. కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అనుకున్నది సాధిస్తుందా, లక్ష ఓట్ల మెజార్టీ వారికి సాధ్యమేనా అన్నది ఈనెల 26న ఫలితాల తర్వాత తేలిపోతుంది.
గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నికలు..
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరుకి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ముందుగా వైసీపీ తరపున మేకపాటి సోదరుడు విక్రమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే ప్రచార పర్వంలో దిగారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆయనకు బాగా కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకెళ్లారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొన్నిరోజుల తర్వాత బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. భరత్ కుమార్ ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. మొత్తం ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో 14మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరులో 83.38 శాతం మేర పోలింగ్ జరిగింది. ఉప ఎన్నిక కాబట్టి ఎంత పోలింగ్ జరుగుతుందనేది ఈసారి ఆసక్తికరంగా మారింది. పోలింగ్ శాతం పెంచాలని, తద్వారా మెజార్టీ పెంచుకోవాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. లక్ష మెజార్టీ వస్తేనే ఆత్మకూరులో వైసీపీ ప్రభంజనం ఉన్నట్టు అని సీఎం జగన్ మంత్రులను ఆదేశించారు. ఆయన ఆదేశాల ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మకూరు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేపట్టారు.
వారిపై చర్యలు తప్పవు..
ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు వుండగా, మొత్తం 2,13, 338 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత అమలులో ఉంటుందని తెలిపారు అధికారులు. ఎన్నికల నియమావళి పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్నారు ఈసీ అధికారులు.
వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ని కూడా ఏర్పాటు చేశారు. మిగతావారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా ప్రత్యేక ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఓటర్లు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అక్రమాలపై సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించినా.. వారు పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాలేదు. ఈసారి లక్ష ఓట్ల మెజార్టీ ఖాయమని చెబుతున్నారు వైసీపీ నేతలు.