మరో మైలురాయి అధిగమించారు..


ఏడాదిన్నర క్రితం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన భారత్...కరోనాను నియంత్రించటంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్‌తోనే ఏ దేశానికీ లేని రికార్డు సాధించింది. 18 నెలల వ్యవధిలోనే 200 కోట్ల డోసులు అందించిన దేశంగా నిలిచింది. ఈ రికార్డుపై మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ స్పందించారు. ప్రధాని మోదీకి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. "వ్యాక్సినేషన్‌లో మరో మైలురాయి అధిగమించినందుకు ప్రధాని మోదీకి అభినందనలు. భారత వ్యాక్సిన్ తయారీదారులతో మా భాగస్వామ్యం ఉండటం మాకెంతో ఆనందంగా ఉంది" అని ట్వీట్ చేశారు. ఇప్పుడే కాదు. ఈ ఏడాది మే లో స్విట్జర్‌లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులోనూ బిల్ గేట్స్ భారత్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను కలిశారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలపై మన్‌సుఖ్ మాండవీయ, తాను ఎన్నో అంశాలు చర్చించామని, అభిప్రాయాలు పంచుకున్నామని ఆ 
సమయంలో వెల్లడించారు బిల్‌గేట్స్. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భారత్ విజయం సాధించటం, ఇందుకోసం వినియోగించిన సాంకేతికత ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రశంసించారు.





 గతేడాది మొదలైన డ్రైవ్


గతేడాది జనవరిలో భారత్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన లెక్కల ప్రకారం..ఈ నెల 19 వ తేదీ నాటికి భారత్‌లో 2 వందల కోట్ల 59 లక్షల డోసులు అందించింది. ప్రపంచ దేశాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్రం. ఆసియా దేశాల్లో జపాన్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే ఫ్రాన్స్‌లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. భారత్‌లో ప్రస్తుతానికి తీవ్రత కనిపించకపోయినా, కేసుల సంఖ్య పెరగకుండా ముందుగానే నియంత్రించాలని భావించింది కేంద్రం. అందుకే ఇటీవలే బూస్టర్ డోసులను ఉచితంగా అందించే క్యాంపెయిన్‌నూ ప్రారంభించింది. 
ఈ తరుణంలోనే 2 బిలియన్ డోసుల రికార్డు సాధించింది. ఈ రికార్డుపై ప్రధానినరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా స్పందించారు. "భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. 2 వందల కోట్ల డోసుల మైలురాయి దాటినందుకు భారత ప్రజలందరికీ అభినందనలు. వ్యాక్సినేషన్‌ ద్వారా కొవిడ్‌పై సమర్థవంతమైన పోరాటం సాగించాం"  అని ట్వీట్ చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా ట్విటర్‌లో అభినందనలు తెలిపారు.