Tirumala Hundi Income: తిరుమల పుణ్య క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణ స్ధితిలో కొనసాగుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దివ్యధామం గోవింద నామ స్మరణలతో మారు మోగుతుంది. నిన్న అంటే జులై 19వ తేదీన మొత్తం 74 వేల 503 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 30 వేల 884 మంది తలనీలాలు సమర్పించారు. ఈ ఒక్కరోజే స్వామి హుండీ ఆదాయం 4.42 కోట్ల రూపాయలు సమకూరింది. అయితే సర్వ దర్శనం భక్తులతో వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లు నిండి బయట లేపాక్షి సర్కిల్ వరకూ క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వ దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల పాటు వేచి చూడాల్సి వస్తోంది.
ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు..
శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు అలిపిరి నడక మార్గం, శ్రీవారి నడక మార్గం, తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమల పుణ్య క్షేత్రానికు చేరుకోవచ్చు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులు ముందుగా సీఆర్వో కార్యాలయం వద్ద వసతి గదులు పొంది, స్వామి వారికి తలనీలాలు సమర్పించి స్వామి వారి దర్శన భాగ్యం పొందే అవకాశం కల్పిస్తోంది టీటీడి. ఇక యాత్రికుల సౌఖర్యార్ధం తిరుమలలో ప్రధాన ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లతో పాటుగా, మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. అదే విధంగా భక్తులకు కోరినన్ని లడ్డూలను భక్తులకు అందిస్తోంది.ఇక తిరుమల యాత్రతో పాటుగా వివిధ యాత్ర ప్రదేశాలు భక్తులు సందర్శించేందుకు బస్సు సౌఖర్యం కల్పించింది.
శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తి భావంతో భూరి విరాళాలు అందించారు. ఇందులో భాగంగా మూల విరాట్టుకు, స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు, ప్లాటినం, బంగారు, వజ్రలు, కెంపులు, పచ్చలు, మకరం తదితర అముల్యమైన అభరణాలు బహుకరించారు. అదే విధంగా బ్రహ్మూత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపు పందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్ర ప్రభ వాహనాలు అందించారు. స్వామివారి వాహనసేవలలో భాగంగా ఐదవ రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ఆయన ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో తయారుచేసి అందించారు.
దీపారాధన కోసం రోజూ 5 కిలలో నెయ్యి..
ప్రతి రోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీత హారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మ దీపానికి, మహారాజ దీపానికి ప్రతి రోజు 5 కేజిల నెయ్యి ఇచ్చే సాంప్రదాయం ఆయన ప్రారంభించగా, అది నేటికీ కొనసాగుతున్నది. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతి నెల ఉత్తరాభద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదే విధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీమలయప్పస్వామివారు కర్ణాటక సత్రాలకు విచ్చేసి ఉట్లోత్సవం అనంతరం ఆలయానికి చేరుకుంటారు. శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. రాత్రి కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు.. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు..