Bihar Politics: భారతీయ జనతా పార్టీకి నితీశ్ కుమార్ భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్‌డీఏకు రాంరాం చెప్పి నితీశ్‌ కుమార్‌ మళ్లీ ఆర్‌జేడీతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బిహార్‌ రాజకీయాల్లో కలకలం రేగింది.


ఇదే కారణం


మిత్రపక్షం భాజపాతో సీఎం నితీశ్ కుమార్ చాలా కాలంగా అంటీమున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. జులై 17 తర్వాత కేంద్రం నిర్వహించిన నాలుగు సమావేశాలకు నితీశ్ గైర్హాజరయ్యారు.


ఆర్‌జేడీతో


భాజపాకు దూరం జరిగిన నితీశ్ మళ్లీ ఆర్‌జేడీతో జట్టుకట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలను కూడా కలుపుకొని బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నితీశ్ భావిస్తున్నట్లు సమాచారం.ఈ మేరకు నితీశ్ ఆయా పార్టీలతో చర్చలు  జరుపుతున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.


సోనియాకు ఫోన్


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా నితీశ్ కుమార్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సోనియాకు ఫోన్ చేసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపారని సమాచారం.


భాజపా మాట


జేడీయూ, భాజపా మధ్య విభేదాలు వచ్చినట్లు వస్తున్న వార్తలను కమలం పార్టీ ఎప్పటిలానే తోసిపుచ్చింది. ఇటీవల కీలక ప్రకటన చేసింది. వచ్చే 2024 లోక్‌సభ, 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)తో కలిసే పోటీ చేస్తామని భాజపా తేల్చిచెప్పింది. 


దూరంగా


కానీ చాలా కాలం నుంచి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఎన్‌డీఏ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమ పార్టీ కేంద్రమంత్రికి రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదు. జేడీయూ పార్టీకి చెందిన ఆర్ సీపీ సింగ్‌ ప్రధాని కేబినెట్‌లో ఒకే ఒక్కడుగా ఉండేవారు. ఇటీవలి కాలంలో ఆయన నితీష్ కుమార్‌ను లెక్కలోకి తీసుకోకుండా వ్యవహరించారు. కుల ఆధారిత జన గణన విషయంలో పార్టీతో ఆయన విభేదించారు. భాజపాతో సన్నిహితంగా ఉన్నందునే నితీశ్ కుమార్ ఇలా ఝలక్ ఇచ్చినట్లు తెలిసింది.


2020 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి నితీశ్ అధికారంలోకి వచ్చినా.. మిత్రపక్షం భాజపాకి ఎక్కువ సీట్లు దక్కాయి. దీంతో నితీశ్‌‌పై ఆ పార్టీ పెత్తనం చెలాయిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగా పలుమార్లు నితీశ్ కుమార్ అసహనానికి గురవుతున్నారు.


దీంతో నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. భాజపాకు గుడ్‌బై చెప్పి మరోసారి ఆర్‌జేడీతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్నాయి. 


Also Read: Indian Special Forces: ఈ ప్రత్యేక దళాల గురించి తెలుసా? వీటిని ఢీ కొట్టే సత్తా దేనికీ లేదు!


Also Read: Venkaiah Naidu Farewell: 'మీ కౌంటర్లకు ఎదురు లేదు, మీ పంచ్‌లకు తిరుగు లేదు'- వెంకయ్యపై మోదీ ప్రశంసలు