Sourav Ganguly Comments: భారత మహిళల క్రికెట్‌ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం గెలిచిన హర్మన్‌ సేనను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అభినందించాడు. మహిళల క్రికెట్లో ఇదో గొప్ప మైలురాయిగా వర్ణించాడు. గెలవాల్సిన మ్యాచులో ఓడిపోవడంతో  కాస్త నిరాశతోనే స్వదేశంలో అడుగుపెడతారని అన్నాడు.


ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. ఆ జట్టు నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. 19.3 ఓవర్లలో 152కు ఆలౌటైంది. 9 పరుగుల తేడాతో స్వర్ణ పతకానికి దూరమైంది. ఛేదనలో 22 వద్దే ఓపెనర్లు షెఫాలీ వర్మ (11: 7 బంతుల్లో, రెండు ఫోర్లు), స్మృతి మంధాన (6: 7 బంతుల్లో, ఒక ఫోర్) ఔటయ్యారు. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్జ్ (33: 33 బంతుల్లో, మూడు ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (65: 43 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు.


వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ టీమిండియా వైపే ఉంది. 3 పరుగుల వ్యవధిలో వీరితో పాటు పూజా వస్త్రాకర్ (2: 5 బంతుల్లో) ఔటవ్వడంతో రన్‌రేట్‌ పెరిగి ఓటమి పాలైంది. అంతకు ముందు ఆసీస్‌లో బెత్ మూనీ (61: 41 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్‌ (36: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు.




కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ప్రతిష్ఠాత్మక క్రీడల్లో టీమ్‌ఇండియా రజతం గెలిచి చరిత్ర సృష్టించినందుకు గంగూలీ ప్రశంసించాడు. 'బర్మింగ్‌హామ్‌లో వెండి పతకం గెలిచిన భారత మహిళల జట్టుకు అభినందనలు. కానీ వారు నిరాశతోనే స్వదేశానికి వస్తారు. ఎందుకంటే ఇది వారు గెలవాల్సిన మ్యాచ్‌' అని దాదా ట్వీట్‌ చేశాడు.


'నిజమే, మా అందరికీ ఇదో గొప్ప సందర్భం. తొలిసారి మేమీ క్రీడల్లో పాల్గొన్నాం. మొదట్నుంచీ అద్భుతంగా ఆడాం. దాదాపుగా బంగారు పతకానికి చేరువయ్యాం. ఎప్పట్లాగే పెద్ద టోర్నీలో చేసినట్టే ఇక్కడా పొరపాట్లు చేయడంతో దూరమయ్యాం. మా లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ మరింత బలోపేతం కావాలి. మున్ముందు అన్నీ సరిదిద్దుకుంటాం. ఈ రజత పతకం మాకెంతో విలువైంది. స్వదేశంలోని అమ్మాయిల్లో కచ్చితంగా ప్రేరణ నింపుతుంది' అని టీమ్‌ఇండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ వెల్లడించింది.