రోడ్డు భద్రత పెంచేందుకు కేంద్రం కొత్త ప్రోగ్రామ్..


రోడ్డు భద్రతను పెంచేందుకు కేంద్రం ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. క్రాష్ టెస్ట్‌లో ఆటోమొబైల్స్ ఏ మేర తట్టుకుని నిలబడతాయో
చూసి, దాని ఆధారంగా రేటింగ్‌ ఇచ్చేలా..భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్-NCAPని ప్రతిపాదించింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇదే విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. "క్రాష్ టెస్ట్‌ ఆధారంగా వాహనాలకు స్టార్ రేటింగ్‌లు ఇచ్చే ఎన్‌సీఏపీ డ్రాఫ్ట్‌ని ఇప్పుడే ఆమోదించాను" అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆటోమొబైల్ రంగంలో భారత్ ఆత్మనిర్భరత సాధించేందుకు ఈ కొత్త ప్రోగ్రామ్‌ ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే భారత్‌ను ఆటోమొబైల్‌ హబ్‌గా నిలబెడుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు. 


క్రాష్‌ టెస్ట్ ఆధారంగా స్టార్ రేటింగ్‌లు


2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. ఈ వ్యవస్థలో భాగంగా ఆటోమొబైల్స్‌కి 
1 నుంచి 5 మధ్యలో రేటింగ్స్ ఇస్తారు. అంతర్జాతీయ క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్స్‌ని అనుసరిస్తూనే, భారత్‌ రహదారులకు అనుగుణంగా వీటిని తయారు చేశారా లేదా అన్నది పరీక్షిస్తారు. తయారీ దారులు వేరే ఎక్కడికో వెళ్లి క్రాష్ టెస్ట్ చేయటానికి బదులుగా భారత్‌లోనే ఇన్‌హౌజ్ టెస్టింగ్‌కు సంబంధించిన వసతులు సమకూర్చనున్నారు. ఈ క్రాష్ టెస్ట్ చేయటం ద్వారా రోడ్డు భద్రతను పెంచుకోవటమే కాకుండా భారత్ నుంచి ఎగుమతులనూ పెంచుకునేందుకు అవకాశముంటుందని నితిన్ గడ్కరీ చెబుతున్నారు. అయితే ఈ టెస్ట్ చేయించుకోవటానికి అయ్యే ఖర్చుని తయారీదారు కానీ, దిగుమతిదారులు కానీ భరించాల్సి ఉంటుంది. ఇదో స్వచ్ఛంద కార్యక్రమం అని, ఈ పరీక్ష చేయించటం ద్వారా తయారీదారుల్లో నమ్మకం పెరుగుతుందని కేంద్రం వివరణ ఇస్తోంది. భద్రతను కూడా పెంచినట్టవుతుందని చెబుతోంది. 


ఇప్పటికే గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోందని, ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి ఎప్పుడో సూచించిందని కేంద్రం వెల్లడించింది. మోదీ సర్కార్ ఈ ప్రోగ్రామ్‌ అమలు చేయాలనుకోవటానికిప్రధాన కారణం..ఇటీవలి కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరగటమే. 2020లో 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, అందులో లక్షా 31 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మూడున్నర లక్షల మంది గాయపడ్డారు. తమిళనాడులో అత్యధికంగా 45 వేలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి.