తెలంగాణలో ఒకప్పుడు ఎటు చూసినా గడిల పాలన. గడి కోటలే అప్పటి సచివాలయాలు. గడిల కేంద్రంగా పాలన సాగేది. రాజసం ఉట్టిపడేలా సంస్థానాలు. ఒకప్పటి ఇందూరు జిల్లా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా... గడిల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ఇందులో ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో సిర్నాపల్లి సంస్థానానికి ఎంతో చరిత్ర ఉంది.


నాడు సంస్థానం- నేడు పర్యాటక ప్రదేశం


ఒకప్పుడు అదో సంస్థానం. రాజసంలో వైవిద్య ప్రాంతం. ఎన్నో ప్రత్యేకతలు రాజసం ఉట్టిపడే... సిర్నాపల్లి సంస్థానానం ఎంతో ప్రత్యేకం. రాణి శీలం జానకీ భాయి ఏలిన చరిత్రతోపాటు ఎన్నో ప్రత్యేకలు సొంతం చేసుకుంది ఈ సిర్నాపల్లి సంస్థానం. కాకతీయులు, కుతుబ్‌షాల తర్వాత నిజాంలు పాలించిన సంస్థానం సిర్నాపల్లి. వందల ఏళ్లుగా అనేక మంది పాలనలో ప్రాధాన్యం సంతరించుకుంది. ధర్పల్లి మండలంలోని సిర్నాపల్లి గ్రామం. నిజామాబాద్ జిల్లాలోనే అతి పెద్ద సంస్థానంలో ఒకటి.


శీలం జానకీ భాయి నిజామాబాద్‌ లక్ష్మీ భాయి


నిజాం కాలంలో మొదట్లో నర్సాగౌడ్ అధీనంలో ఉండేది. ఆ తర్వాత శీలం ప్రతాప్ రెడ్డి ఆధీనంలోకి వచ్చింది ఈ సంస్థానం. ఆయన చిన్న వయసులోనే చనిపోతే ఆయన భార్య శీలం జానకీ భాయి. ఈ రాణి కూడా చిన్న వయసులోనే సంస్థానం బాధ్యతలు చేపట్టింది. శీలం జానకీ భాయికి సంతానం లేకపోవటంతో మెదక్ జిల్లాకు చెందిన రామ లింగారెడ్డిని దత్తత తీసుకుని పెంచింది. శీలం జానకీ భాయి చాలా కాలం పాలన సాగించింది. ఈమె హయాంలో చాలా అభివృద్ది జరిగిందని చరిత్ర చెబుతుంది. దాదాపు వంద గ్రామాలు ఈ సంస్థానంలో అధీనంలో ఉండేవి. సిర్నాపల్లి, ఇందల్వాయి, జానకం పేట్, నవీపేట్, రెంజల్ మండలాల్లోని గ్రామాలు మరికొన్ని తండాలు ఈ సంస్థానం కింద వచ్చేవి. ఈ గ్రామాలన్నింటికీ శీలం జానకీ భాయి రాణి. పన్ను వసూళ్లలో పోలీసు వ్యవస్థ శీలం జానకీ భాయి కనుసన్నల్లోనే ఉండేది.  ఈ సిర్నాపల్లి గడి రాణి నివాసం కోసం ఉపయోగించేది.


ఆకట్టుకునే డిజైన్లు


రాణి శీలం జానకీ భాయి నివాసం కోసం ఉపయోగించిన సిర్నాపల్లి సంస్థానం 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గడి ఎంతో కళాత్మకంగా ఉంటుంది. గడి చుట్టూ లోతైన కందకం ఉండేది. కందకంలో రాణి రక్షణ కోసం మోసళ్లు వదిలేవారు. అప్పల్లో ఈ గడి ఎంత ఉండేదో సిర్నాపల్లి గ్రామం అంతే ఉండేది. రాణి ఎంత స్థలంలో నివసించే వారో ఆ గ్రామం కూడా అంతే స్థలంలో ఉండేదని చరిత్ర. గడిలో అడుగుపెట్టే ముందు ప్రాంగణంలో పెద్ద కమాన్ ఉండేది. ప్రస్తుతం ఒక్క బురుజే మిగిలింది. ఈ ప్రాంగణంలో ఒకప్పుడు అనేక భవనాలు ఉండేవి. సిర్నాపల్లి గడిలోకి వెళ్లగానే పెద్ద రాతి భవనం కనిపిస్తుంది. భవనం ముందు భాగం ఆర్చీ డిజైన్ లతో అందంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ లను గోదీప్ డిజైన్లు అంటారు. పశ్చిమ యూరప్ లో ఎక్కువగా కనిపిస్తాయ్. ఈ ఆర్కిటెక్చర్ మధ్య యుగంలో భారత్ కు వచ్చాయ్. రాళ్లతో మలిచిన ఈ ఆర్చ్ లు రాతి స్థంబాల ఆధారంగా నిలబడతాయి. ఆ రోజుల్లో సంస్థానాలకు విదేశాలతో సంబంధం ఉండేవని ఈ ఆర్కిటెక్చర్ చూస్తే తెలుస్తుంది. ఈ భవనం డిజైన్లలో వాడే వస్తువుల్లో వైవిద్యం కనిపిస్తుంది.


రెండంతస్తుల భవనంపైన రాతి సింహాలు, పిరమిడ్ల డిజైన్లు ఆకర్షిస్తాయి. పైకి మాత్రమే కాదు పిరమిడ్ ఆకారమంలో రాయిని మార్చడానికి ఎంతో నైపుణ్యం కావాలి. నాటి పాలకుల రాజసం, గొప్పతనం చాటుకోవటానికి ఇలా నిర్మించుకున్నారని తెలుస్తోంది. ఈ డూప్ లెస్ బిల్డింగ్ లో రెండు విశాలమైన హాళ్లు,  20 గదులు నిర్మించారు. ఈ కోటను జానకీ బాయి మరింత లక్జరీగా ఏర్పాటు చేసుకున్నారు. భవన నిర్మాణంలో ప్రత్యేకతలు ఎన్నోఉన్నాయ్. ఏ కాలంలోనైనా భవనం చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంటుంది. గడిలో ద్వారాలు ఆటోమెటిక్ గా మూసుకుపోతాయ్. ఈ ద్వారాలను లండన్ నుంచి తెప్పించారని చరిత్ర. గడిలో ఎవరైనా ఆకస్మికంగా చొరబాటు చేస్తే తప్పించుకోవటానికి సిక్రేట్ మార్గం ఉండేదట. ఆ తర్వాత దోర వారసులు ఈ సంస్థానంలోని భూమిని పాఠశాల కోసం ఇచ్చారు. అయితే 119 ఏళ్ల తర్వాత కూడా సిర్నాపల్లి సంస్థానం చెక్కు చెదరకుండా ఉంది. నిజామాబాద్ జిల్లాను పాలించిన రాణి శీలం జానకీభాయి నివాసం ఉన్న ఈ సంస్థానంను పర్యాటకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు స్థానికులు.