నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన అమ్రాయి కాలనీ వద్ద జాతీయ చేప పిల్లల కేంద్రంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతో చేపపిల్లల ఉత్పత్తి ప్రక్రియ సకాలంలో ప్రారంభం కావడం లేదు. కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి జూన్ మొదటి వారంలో ప్రారంభం కావాలి. కానీ సరిపడ నీరు లేక ఇప్పటికీ ప్రారంభం కాలేదు. తల్లి చేపలను నిల్వ ఉంచడానికి కూడా నీరు లేని దుస్థితి.
చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేస్తారు. ప్రాజెక్ట్ నుంచి కేంద్రం వరకు గల పైపులైను ఆరేళ్ల క్రితం నెహ్రూ పార్కు వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదు. అంతేకాకుండ ప్రాజెక్ట్ నీటిమట్టం 1065 అడుగులు దాటితేనే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి నీటి సరఫరా చేపట్టవచ్చు. ప్రస్తుతం 1067 నీటి మట్టం ఉంది. అయినా నీటి సరఫరాకు ఇబ్బంది అవుతోంది.
బావి నీరే దిక్కు
చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఆవరణలో ఊట బావి ఉంది. ఆ బావి నీళ్లే ప్రస్తుతం తల్లి చేపలకు దిక్కు అవుతున్నాయి. చేపపిల్లల కేంద్రంలో 5 కోట్ల తల్లి చేపలకు నీటిని అందిస్తోందీ బావి. పిల్లల ఉత్పత్తి జరగాలంటే రెండు టన్నుల తల్లి చేపల అవసరం ఉంటుంది. తల్లి చేపలను తీసుకువచ్చి మట్టి కుండీల్లో పొదగ వేసిన తరువాత హేచరీలో స్పాను ఉత్పత్తి చేస్తారు. తల్లి చేపలను నిల్వ ఉంచడానికి కూడా సరిపడినంత నీరు లేదు. ప్రతి ఏటా సకాలంలో చేప పిల్లల ఉత్పత్తి చేపట్టక పోవడంతో 5 కోట్ల చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యం చేరు కోవడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి చేప పిల్లలను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉన్నత అధికారులు స్పందించి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో నీటి కొరతను తీర్చాలని మత్స్య కారులు వేడుకుంటున్నారు.
ఇక్కడ ఉత్పత్తి అయిన చేప పిల్లలను జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులకు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలకు సైతం చేపపిల్లలను పంపిణీ చేస్తారు. అయితే ప్రతి ఏటా చేపల పిల్లల ఉత్పత్తి లక్ష్యానికి చేరుకోవటం లేదన్న వాదన ఉంది. సకాలంలో చేప పిల్లల ఉత్పత్తి చేస్తేనే మత్స్యకారులకు చేరువుల్లో చేపలు పెంచుకునేందుకు వీలుంటుంది. కానీ నీటి కొరత అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా ఏటా చేపపిల్లల ఉత్పత్తి ఆలస్యం అవటం తంతుగా మారుతోంది.