Bharat Jodo Yatra: 


బహిరంగ సభలో సోనియా..


దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపడుతున్న భారత్ జోడో యాత్ర కర్ణాటకకు చేరుకుంది. మొన్నటి వరకూ కేరళలో పాదయాత్ర చేసిన రాహుల్.. స్థానికులతో మమేకమవుతూ కాస్త హుషారుగానే కనిపించారు. సోషల్ మీడియాలోనూ ఈ యాత్రకు సంబంధించిన ప్రచారం బాగానే జరుగుతోంది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున కర్ణాటకకు చేరుకున్నారు రాహుల్. దసరా కారణంగా మధ్యలో రెండు, మూడు 
రోజులు విరామమిచ్చి ఇవాళ మళ్లీ యాత్ర మొదలు పెట్టారు. ఈ రాష్ట్రంలో రాహుల్‌తో పాటు సోనియా గాంధీ కూడా పర్యటిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో పాటు భాజపా ఇక్కడ అధికారంలో ఉండటం వల్ల కాంగ్రెస్ ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. చాలా రోజుల తరవాత ఆమె ఓ బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా...పార్టీ కార్యక్రమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు సోనియా. కర్ణాటకలో మాండ్య నుంచి పాదయాత్ర మొదలు కాగా...రాహుల్‌, సోనియా ఇందులో పాల్గొని పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. బళ్లారిలో ఓ భారీ ర్యాలీ చేపడతారని, అందులోనూ సోనియా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్రలో పాల్గొనక ముందు... బేగూరు గ్రామంలోని ఓ ఆలయాన్ని సందర్శించారు. 










ఉత్సాహంగా రాహుల్ గాంధీ..


భారత్‌ జోడో యాత్రలో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు రాహుల్ గాంధీ. పార్టీలో ఉత్తేజం నింపేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలే కేరళలో యాత్రను ముగించుకున్న రాహుల్...ఇప్పుడు కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో కాన్నా కాస్త అగ్రెసివ్‌గానే మాట్లాడుతున్నారు. మైసూర్‌లో భారత్ జోడో యాత్రను పున:ప్రారంభించిన రాహుల్...భారీ వర్షం పడుతున్నా...అలాగే నించుని పార్టీ కార్యకర్తలతో ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ స్పీచ్‌ వీడియో కాంగ్రెస్ వర్గాల్లో బాగానే వైరల్ అవుతోంది.  రాహుల్ గాంధీ కూడా తన ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. "భారత్‌ను ఏకం చేయాలనుకునే మా సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరు. భారతదేశ ప్రజల గొంతుకను 
వినిపించకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగే ఈ భారత్ జోడో యాత్రనూ ఎవరూ నిలువరించలేరు" అని రాహుల్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 7వ తేదీన భారత్ జోడో యాత్రను ప్రారంభించింది కాంగ్రెస్. కన్యాకుమారి నుంచి మొదలై...ఇప్పుడు కర్ణాటకకు చేరుకుంది. ఇప్పటికి 624 కిలోమీటర్ల మేర యాత్ర ముగిసింది.


తెలంగాణలోనూ యాత్ర..


తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. అక్టోబర్ 24న తెలంగాణలో ప్రవేశించనున్న రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో 13 రోజులపాటు జరగనుంది. ఇందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది పీసీసీ. తెలంగాణలో 359 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. తెలంగాణలో మొత్తం 13 రోజులకు రాహుల్ గాంధీ పాదయాత్రను కుదించారు. 13 రోజుల పాటు రోజు వారీగా రాహుల్ యాత్రలో పాల్గొనే నియోజకవర్గాల జాబితా కూడా సిద్ధం చేశారు. మక్తల్  నియోజకవర్గం కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల వెల్లడించారు.


Also Read: Kerala School Bus Accident: ఆర్టీసీని ఢీ కొట్టిన స్కూల్‌ విద్యార్థుల బస్సు- ఐదుగురు చిన్నారులు సహా 9 మంది మృతి!