Bharat Jodo Yatra:


జైరాం రమేశ్ వెల్లడి..


రాహుల్ గాంధీ నేతృత్వంలో నెలల పాటు సాగిన భారత్ జోడో యాత్ర ఈ మధ్యే ముగిసింది. కశ్మీర్‌లో సభ నిర్వహించి ఆ యాత్రకు ముగింపు పలికింది కాంగ్రెస్. ఈ జర్నీలో తాను ఎన్నో నేర్చుకున్నట్టు చెప్పారు రాహుల్ గాంధీ. అంతే కాదు. ఇది గ్రాండ్ సక్సెస్ అయిందనీ వెల్లడించారు. అయితే...కాంగ్రెస్ మరోసారి ఇలాంటి యాత్రే చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ మొదటి విడత యాత్ర సాగగా...రెండో విడతలో తూర్పు నుంచి పశ్చిమం వైపు యాత్ర సాగించాలని భావిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాసిఘట్ నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్‌ వరకూ యాత్ర చేపట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ తపస్సుని రాహుల్ గాంధీ మరి కొద్ది రోజుల పాటు కొనసాగించాలని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు. 


"కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ దాదాపు 4 వేల కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర సాగింది. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం వచ్చింది. ఇది రాహుల్ గాంధీ గమనించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ కొత్త శక్తితో పని చేశారు. అందుకే మరోసారి ఇలాంటి యాత్ర కొనసాగించాలని భావిస్తున్నాం. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిఘట్ నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్‌ వరకూ యాత్ర చేపట్టాలని చూస్తున్నాం. అయితే...ఇది భారత్‌ జోడో యాత్రకు కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ మార్గంలో నదులుంటాయి. దాదాపు పాదయాత్రగానే ఇది కొనసాగుతుంది. కానీ అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ తీరు మారుతుంది. " 


- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 










కర్ణాటకలో ఈ ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరవాత జూన్ నుంచి వర్షాలు పడతాయి. అందుకే జూన్‌లోగా ఈ యాత్ర పూర్తి చేయాలని భావిస్తున్నట్టు వివరించారు జైరాం రమేశ్. భారత్‌ జోడో యాత్రతో పోల్చితే ఈ యాత్ర తక్కువ దూరమే ఉంటుందని చెప్పారు. మరి కొద్ది వారాల్లోనే దీనికి సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ తయారు చేస్తామని తెలిపారు. ఇటీవలే భారత్ జోడో యాత్రను ముగించారు రాహుల్ గాంధీ. ఈ ప్రయాణంలో తనను తాను మార్చుకున్నానని చెప్పారు. అసలైన సమస్యల గురించి ప్రజలతో చర్చించే అవకాశం దొరికిందని అన్నారు. ఈ యాత్ర తనకో తపస్సు లాంటిందని వెల్లడించారు రాహుల్ గాంధీ. 


Also Read: Jammu Kashmir: కశ్మీర్‌లో మరోసారి ఉగ్ర అలజడి, సెక్యూరిటీ గార్డ్‌పై కాల్పులు - ప్రాణాలతో పోరాడి మృతి