Chandrababu Starts Intintiki Telugu Desam Program: తెలంగాణలో ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా 'ఇంటింటికీ తెలుగుదేశం' కిట్లను చంద్రబాబు పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ తెలుగు దేశం కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతిఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. యువత, మహిళలకు టీడీపీ మాత్రమే పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. 41 ఏళ్లుగా తెలుగువారి కోసమే పనిచేస్తున్న పార్టీ టీడీపీ అని అన్నారు. 


తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని ప్రకటించారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారని అన్నారు. సమష్ఠిగా కృషిచేసి టి.టీడీపీకి పూర్వవైభవం తేవాలి. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదే. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో మౌళిక వసతులు సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత టీడీపీదే. కాసాని జ్ఞానేశ్వర్‌ నేతృత్వంలో పార్టీ బలోపేతం’’ అవుతోందని చంద్రబాబు అన్నారు.


‘‘సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం, అభివృద్ధి చేయడమే టీడీపీ లక్ష్యం. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, పేదలకు అందించడం అంతే ముఖ్యం. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుంది. టీడీపీ ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభే సమాధానం. ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తోంది. తెలుగువారు ఎక్కడున్నా వారికోసం టీడీపీ పనిచేస్తుంది. కాసాని నేతృత్వంలో తెలంగాణ టీడీపీ పరుగులు పెడుతోంది. తెలంగాణలో మొదటి సీటు నాయిబ్రాహ్మణులకు, రెండో సీటు రజకులకు ఇస్తాం. తెలంగాణ తెలుగు దేశం పార్టీకి యువత అండగా నిలబడాలి. విభజన తర్వాత లేనిపోని సమస్యలు పెట్టుకోవటం సరికాదు. తెలంగాణలో సంపద సృష్టించడానికి కారణం టీడీపీనే. పేదలను నాయకులుగా ప్రమోట్ చేసిన పార్టీ టీడీపీ మాత్రమే. ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తోంది. ఎన్టీఆర్‌ భవన్ చుట్టూ కాకుండా కింది స్థాయి నేతలు గ్రామాల్లో తిరిగితే టీడీపీని కాపాడుకోవడం సులభం అవుతుంది’’ అవసరం ఉందని చంద్రబాబు మాట్లాడారు.


మాకు కాంటాక్ట్ లో ఇతర పార్టీల నేతలు - కాసాని


గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేయాలని కాసాని పిలుపు ఇచ్చారు. ఆదివారం ‘‘ఇంటింటికీ తెలుగుదేశం’’ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామగ్రామాన తెలుగుదేశం నినాదం‌ మారుమోగేలా చేస్తామని చెప్పారు. టీడీపీకి పూర్వవైభవం‌ తీసుకురావటానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ నేతలంతా నెలరోజుల పాటు గ్రామాలు, బస్తీల్లోనే ఉండాలని అన్నారు. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా సరే టీడీపీని బలోపేతం చేస్తామని, టీడీపీలో చేరికకు పలువురు ఇతర పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.