వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు రోజు ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. ఆ ఫోన్ కాల్‌లో ప్రీతి తాను కాలేజీలో పడుతున్న వ్యధను తన తల్లితో చెప్పుకుంది. తన సీనియర్ అయిన సైఫ్ అనే వ్యక్తి తనతోనే కాకుండా తన తోటివారిని, జూనియర్లను కూడా వేధిస్తున్నాడని తల్లితో వాపోయింది. సీనియర్లు అంతా ఒకటే అని తన తల్లితో చెప్పింది. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా ఫలితం లేకుండా పోయిందని, సైఫ్ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని ప్రీతి వాపోయింది. తాను ఒకవేళ సైఫ్ పై ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒకటై తనను దూరం పెడతారని భయం వ్యక్తం చేసింది. సైఫ్ తో తాను మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తాను అని తల్లి చెప్పినట్లుగా ఆడియో టేప్‌లో ఉంది. 


‘‘సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్ లని వేధిస్తున్నాడు. సీనియర్లు అంతా ఒకటే.  నాన్న పోలిసులతో ఫోన్ చేయించాడు. అయినా లాభం లేకుండా పోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నేను సైఫ్ పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటైపోయి నన్ను దూరం పెడతారు. HOD నాగార్జున రెడ్డి ఏదైనా ఉంటే నా దగ్గరికి రావాలి కానీ.. ప్రిన్సిపాల్ కి ఎందుకు ఫిర్యాదు చేశారని నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు’’ అని ప్రీతి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ బాధ పడింది. ఇలా అన్ని దారులూ మూసుకుపోవడంతోనే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.


సైఫ్ అరెస్ట్ 


వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అందుకు కారణంగా భావిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. సీనియర్ పీజీ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి.  విచారణ చేసిన మట్టెవాడ పోలీసులు సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ ఫోన్‌ను చెక్ చేసిన పోలీసులకు ఛాటింగ్‌లో కొన్ని ఆధారాలు వెలుగు చూశాయి. పోలీసులు సైఫ్‌ఫై ర్యాగింగ్, వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లుగా ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. .  


సైఫ్ కి 14 రోజుల రిమాండ్


మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సైఫ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సైఫ్ ను ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.


మంత్రి ఎర్రబెల్లి పరామర్శ


పీజీ విద్యార్థిని ప్రీతి కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి ఓదార్చారు. వ్యక్తిగతంగా తాను, ప్రభుత్వం  అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.  ప్రీతికి మంచి వైద్యం అందిస్తున్నామన్నారు. అలాగే ప్రీతి తల్లిదండ్రులు శారద (రైల్వే లో ఏఎస్ఐ) దరావత్ నరేందర్ నాయక్ లతో వైద్యులను కలిపి ప్రత్యేకంగా మాట్లాడారు.  ప్రీతి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. కుటుంబ సభ్యులకు ఉన్న సందేహాలను నిమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్, ఇతర వైద్యులతో మాట్లాడించి నివృత్తి చేశారు. జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.