భవానీపుర్‌ శాసనసభ స్థానానికి బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్‌ వేశారు. కోల్​కతాలోని సర్వే బిల్డింగ్​కు చేరుకొని నామపత్రాల సమర్పించారు.





మమతా బెనర్జీపై భవానీపూర్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు తమ అభ్యర్థిని భాజపా ప్రకటించింది. న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్ ను తమ అభ్యర్థిగా భాజపా వెల్లడించింది. భవానీపుర్​తో పాటు ఈ నెల 30న ఎన్నికలు జరిగే ఇతర నియోజకవర్గాలకూ అభ్యర్థులను భాజపా ఖరారు చేసింది. 


జంగీపుర్ నుంచి సుజిత్ దాస్‌, సంషేర్‌గంజ్ నుంచి మిలన్ ఘోష్ ను బరిలో నిలిపింది భాజపా. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.


ఎవరీ ప్రియాంక..?



  1. ప్రియాంక తిబ్రీవాల్.. 2014 ఆగస్టులో భాజపాలో చేరారు. అంతకుముందు బాబుల్ సుప్రీయోకు ఆమె న్యాయ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.  

  2. 2020 ఆగస్టులో బంగాల్ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం)కు ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు.

  3. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సెంట్రల్​ కోల్‌కతాలోని ఎంటల్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంక.. భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

  4. బంగాల్​ శాససనభ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై కలకత్తా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన వారిలో ప్రియాంక ఒకరు.

  5. ప్రస్తుతం పార్టీ జాతీయ అధికార ప్రతినిధుల్లో ప్రియాంక ఒకరు.


మమతా ఓటమి..


ఈ ఏడాది ఏప్రిల్​లో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు టీఎంసీ 213 చోట్ల గెలిచింది. భాజపా 77 చోట్ల గెలిచి ప్రధాన ప్రతిపక్ష స్థానం సంపాదించుకుంది. ఎన్నికల అనంతరం ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు.


మమతా బెనర్జీ నందిగ్రామ్​ నియోజకర్గం నుంచి పోటీ చేసిన భాజపా అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. సీఎం పదవి చేపట్టిన దీదీ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. అందుకే భవానీపుర్ ఉప ఎన్నికలో విజయం మమతకు కీలకంగా మారింది. భవానీపుర్​ సహా మరో రెండు నియోజకవర్గాల ఉపఎన్నికల ఫలితాలు అక్టోబర్ 3న వెలువడనున్నాయి.