భారత్-ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ చివరి నిమిషంలో రద్దయింది. టీమిండియా శిక్షణా సిబ్బందికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ జరుగుతుందని ఆశించిన అభిమానలకు నిరాశే మిగిలింది. అయితే ఇప్పటికే సిరీస్ లో 2-1 తో కోహ్లీ సేన లీడ్ లో ఉంది. 






సిరీస్ మనదేనా..


ఈ మ్యాచ్‌ రద్దయినట్లుగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. అయితే ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు ప్రస్తుతం ఈ మ్యాచ్‌ జరగకపోయినా తర్వాత నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి. అయితే మ్యాచ్‌ పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ ఫలితంపై సందిగ్ధత నెలకొంది.


అయితే ఈ విషయాన్ని భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ ముందే చెప్పాడు. మ్యాచ్ జరిగే అవకాశం లేదని వరుస ట్వీట్లు చేశాడు. ఈరోజు మ్యాచ్ జరిగే అవకాశం లేదని.. బయోబబుల్ లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డీకే ట్వీట్ చేశాడు. 














అందరికీ కరోనా నెగెటివ్..


మాంచెస్టర్‌లో జరిగే 5వ టెస్టు సందర్భంగా ఆటగాళ్లకు, వారి సిబ్బందికి తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే ఈ పరీక్షల్లో అందరికీ కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది.


గత వారం టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రి సహా ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. రవి శాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ ఆర్ శ్రీధర్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయినాసరే లండన్‌లోని ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టు కోసం భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టారు.


తాజాగా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిలో ఫిజియోథెరపిస్టు యోగేష్ పర్మార్‌కు కరోనా సోకింది. బుధవారం నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఈ విషయం బయటపడింది. మొదటి టెస్టులో భారత ఆటగాళ్లు అందరూ కరోనా టెస్ట్ చేయించుకోగా నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. మరో రౌండ్ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించగా అందులో ఒకరికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగించింది. అప్పటికే సోమవారం టీమిండియా 5వ టెస్టు మ్యాచ్ కోసం మాంచెస్టర్‌కు చేరుకుంది. మంగళవారం, బుధవారం ట్రైనింగ్ సెషన్ జరిగినప్పటికీ ఫైనల్ సెషన్ మాత్రం రద్దు అయింది. దీంతో 5వ టెస్టును రెండు రోజులు వాయిదా వేశారు.