‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ఎమోషనల్ లవ్ స్టోరీలతో ఆకట్టుకున్న శివ నిర్వాణ.. ఇప్పుడు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ‘టక్ జగదీష్’ సినిమాతో ముందుకొచ్చాడు. టైటిల్‌లో ‘టక్’ చేర్చి.. ఇదేదో వెరైటీగా ఉందే అనిపించాడు. మరి శివ.. నానితో చేసిన ఈ ఫ్యామిలీ డ్రామా ప్రయోగం ఫలించిందా? ఓటీటీలో విడుదలైన ‘టక్ జగదీష్’ ఎలా ఉంది? ఇది ప్రేక్షకులను మెప్పిస్తుందా?


కథ: భూదేవిపురంలో అరటితోటలో అన్నదమ్ముల మధ్య జరిగే గొడవతో కథ మొదలవుతుంది. చివరికి బొప్పాయి పండు కోసం కూడా హత్యలు చేసుకొనే స్థాయిలో భూదేవిపురం ప్రజలు.. పగ, ప్రతీకారంతో రగిలిపోతుంటారు. ఆ ఊరికి పెద్దగా ఉండే ఆదిశేషు(నాజర్) ఎలాంటి గొడవలు లేని భూదేవిపురాన్ని చూడాలని కోరుకుంటాడు. వీరేంద్ర నాయుడు(డానియ‌ల్ బాలాజీ) తండ్రిని ఓ వ్యక్తి.. అంతా చూస్తుండగానే పంచాయ‌తీలోనే చంపేస్తాడు. దీంతో వీరేంద్ర నాయుడు ఆది కేశ‌వులు, అత‌ని కుటుంబంపై ప‌గ పెంచుకుంటాడు. ఆదిశేషుకు ఇద్దరు భార్యలు. అయితే రెండో భార్య చనిపోవడంతో ఆమె కొడుకైన జగదీష్‌(నాని)ని పెద్ద భార్య కన్న కొడుకులా చూసుకుంటుంది. మొదటి భార్య పెద్ద కొడుకు బోసు(జగపతి బాబు) ఆదిశేషుతోపాటు భూదేవిపురంలో ఉంటూ గ్రామస్తులకు సాయం చేస్తుంటాడు. ఓ రోజు ఆదిశేషు హఠాత్తుగా చనిపోతాడు. దీంతో ఆ కుటుంబ బాధ్యతలను బోసు చూసుకుంటాడు. అప్పటివరకు ఎంతో మంచిగా కనిపించే బోసు.. ఆదిశేషు మరణంతో అసలు రంగు చూపిస్తాడు. జగదీష్ ఊర్లో లేని సమయంలో జగదీష్ ఎంతో ఇష్టపడే మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్)కు విరేంద్ర నాయుడు సోదరుడితో పెళ్లి చేస్తాడు. అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆస్తుల కోసం బోసు ఏం చేస్తాడు? తండ్రిని ద్వేషించే విరేంద్ర నాయుడితో బోసు ఎందుకు చేతులు కలుపుతాడు? కుటుంబాన్ని ఎంతో ప్రేమించే జగదీష్.. ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడనేది బుల్లితెరపై చూడాల్సిందే.


విశ్లేషణ: ప్రేమ కథల నుంచి బయటకు వచ్చిన శివ.. కుటుంబ కథలను ఎంచుకోవడం మెచ్చుకోతగినదే. పైగా ఎన్నో ట్విస్టులు ఉండే ఈ కుటుంబ చిత్రాన్ని రెండున్నర గంటలపాటు ప్రేక్షకులు మెచ్చుకొనే విధంలా తెరకెక్కించుకోవడం పెద్ద సవాలే. అయితే, ఈ విషయంలో శివ మరికొంత శ్రద్ధ పెడితే సినిమా రక్తి కట్టేది అనిపిస్తుంది. ముఖ్యంగా ఈచిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ మచ్చుక కనిపించవు. కథ మొదటి నుంచి పగలు, ప్రతీకారాలతో సీరియస్‌‌గా నడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వచ్చే కొన్ని సరదా సన్నివేశాలు మినహా.. ప్రేక్షకుడు హాయిగా నవ్వుకొనే సన్నివేశాలేవీ ఇందులో ఉండవు. కథ ఆధ్యాంతం సీరియస్‌గా నడుస్తుంది. భావోద్వేగ సన్నివేశాలను అల్లుకోడానికే దర్శకుడు ఎక్కువ దృష్టిపెట్టాడేమో అనిపిస్తుంది. ఇక కథ కూడా పాతదే. ఇలాంటివి తెలుగు ప్రేక్షకులు చాలానే చూశారు. అయితే, ఈ సినిమాలో కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని ఎమోషన్లను పలికించడంలో నానికి తిరుగే లేదు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో నాని నటన గుండె బరువెక్కిస్తుంది. అయితే, ఈ చిత్రంలో నాని మరీ సీరియస్‌గా కనిపిస్తాడు. ఈ కథ మొత్తం నాని, జగపతి బాబు చుట్టూ తిరుగుతుంది. దీంతో మిగతా పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు. రీతూవర్మ తన అందంతో ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్, నాజర్, రావు రమేష్, నరేష్, డానియల్ బాలాజీ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక జగపతిబాబు ఇందులో రెండు రకాల వేరియేషన్స్ పలికించారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. తమన్ అందించిన సంగీతంలో ఒకటి రెండు పాటలు బాగున్నాయి. అయితే, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసి నిర్మాతలు మంచి పనే చేశారనిపిస్తుంది. మొత్తానికి ఈ కథను కుటుంబంతో కలిసి ఒకసారి చూడవచ్చు. 


నటీనటులు: నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌, నాజర్‌, జగపతి బాబు, డానియ‌ల్ బాలాజీ, రావు రమేశ్‌, నరేశ్‌ తదితరులు
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు:  సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది 
నిర్మాణం:  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌
సంగీతం: తమన్‌
నేపథ్య సంగీతం:  గోపీసుందర్‌
విడుదల: సెప్టెంబర్‌ 10, 2021(అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో)