Bengal SSC Scam:
మంత్రి పదవిలో ఉండి చేసేది ఇదేనా..?: కునాల్ ఘోష్
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ఇంట్లో మరోసారి పెద్ద ఎత్తున నగదు దొరకటం సంచలనమైంది. అటు మంత్రిపైనా క్రమంగా ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. టీఎమ్‌సీ ప్రతినిధి ఒకరు కాస్త ఘాటుగానే విమర్శలు చేశారు. "ఆయన ఒక్కడి వల్ల మొత్తం పార్టీకి చెడ్డ పేరు వచ్చింది" అని వ్యాఖ్యానించారు. కునాల్ ఘోష్ ఈ కామెంట్స్ చేశారు. ఈడీ వరుస దాడుల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరుకుతుండటంపై ఇలా అసహనం వ్యక్తం చేశారు కునాల్ ఘోష్. పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పార్థ ఛటర్జీ...ఇలాంటి అవినీతికి పాల్పడటం వల్ల పార్టీకి అప్రతిష్ఠ వచ్చిందని కునాల్ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరకూ ఈడీ సోదాల్లో రూ.50 కోట్ల నోట్ల కట్టలు బయటపడగా, 5 కిలోల బంగారం సహా, ఫారిన్ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. "ఇలాంటి సంఘటనలు జరగటం పార్టీకి అవమానం. "ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకుంటాను అని కూడా చెప్పడం లేదు. ప్రజల్లోకి వచ్చి తనకేమీ తెలియదని, అమాయకుడినని ఎందుకు చెప్పటం లేదు? ఇలాంటి వివరణ ఇవ్వటానికి ఏంటి సమస్య..?" అని మండి పడ్డారు కునాల్ ఘోష్. "ఓ కేబినెట్ మంత్రిగా ఆయన ఎన్నో బాధ్యతలు చేపడుతున్నారు. అలాంటి వ్యక్తి ఇలా చేయటమేంటో అర్థం కావట్లేదు" అని అసహనం వ్యక్తం చేశారు.
మంత్రి పదవి నుంచి తొలగించాలి: కునాల్ ఘోష్
మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు కునాల్ ఘోష్. ట్విటర్ ద్వారా ఈ డిమాండ్ చేసిన ఆయన కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమని పార్టీ ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పార్టీ ఈ అంశంపై చర్చిస్తోందని చెప్పారు. మీటింగ్ జరిగిన తరవాతే దీనిపై అధిష్ఠానం ప్రకటన చేస్తుందనివెల్లడించారు. అయితే గతంలోనే అధిష్ఠానం ఈ విషయమై ఓ ప్రకటన చేసింది. మంత్రి పార్థ ఛటర్జీ తప్పు చేశారని కోర్టు తేల్చి చెబితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇప్పటికైతే ఆయనను పదవి నుంచి తొలగించటం లేదని చెప్పింది. అయితే అధిష్ఠానం మాత్రం తమ ప్రొసీడింగ్స్‌లో పార్థ ఛటర్జీని "మంత్రి"గా మాత్రం పరిగణించటం లేదని తెలుస్తోంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.