Bengal Ram Navami Violence:



ప్రీప్లాన్డ్‌ దాడులు..


శ్రీరామ నవమి వేడుకల సమయంలో పలు రాష్ట్రాల్లో ఘర్షణలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది కేంద్ర హోం శాఖ. ఈ మేరకు Fact-Finding Committeeని కూడా నియమించింది. పాట్నా హైకోర్టు మాజీ జస్టిస్ ఎల్ నర్సింహ రెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. ఈ అల్లర్లపై మధ్యంతర నివేదిక తయారు చేసింది ఈ కమిటీ. పశ్చిమ బెంగాల్‌లో రామనవమి రోజున పలు చోట్ల ఘర్షణలు జరగడంపై విచారించి..సంచలన విషయం వెల్లడించింది. ఈ అల్లర్లు పథకం ప్రకారం జరిగినవే అని తేల్చి చెప్పింది. ఉద్దేశపూర్వకంగానే జరిగిన దాడులు అని స్పష్టం చేసింది. అయితే...ఆదివారం (ఏప్రిల్ 9) రోజున ఈ ఆరుగురు సభ్యులు హుగ్గీలోని ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లారు. కానీ...పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించింది. పోలీసులు తమను అడ్డుకుంటున్నారని మాజీ న్యాయమూర్తి నర్సింహ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"ఇక్కడ CrPC సెక్షన్ 144 అమలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఎక్కడ నిజాలు బయట పడతాయో అని మా విచారణకు అడ్డుతగులుతున్నారు"


- పాట్నా హైకోర్టు మాజీ జస్టిస్ ఎల్ నర్సింహ రెడ్డి


కొన్నగర్ ప్రాంతంలో తమను పోలీసులు అడ్డుకున్నట్టు కమిటీ వెల్లడించింది. అనవసరంగా ఆంక్షలు విధిస్తున్నారని మండి పడింది. అంతకు ముందు రోజు బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ ఇదే ప్రాంతంలో పర్యటనకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. తనను బయటి వ్యక్తిగా చూస్తున్నారంటూ ఆమె మండి పడ్డారు. 


"నేనో లోకల్ ఎంపీని. నన్ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని నాకు ఆహ్వానం అందింది. కానీ పోలీసులు మాత్రం నన్ను వెనక్కి వెళ్లిపోమని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిని. నా నియోజవర్గంలో పర్యటించడానికి నన్ను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు.."


- లాకెట్ ఛటర్జీ, బీజేపీ ఎంపీ 


శ్రీరామ నవమి వేడుకల్లో పలు రాష్ట్రాల్లో హింస చెలరేగింది. గ్రూపుల గొడవలతో చాలా మంది గాయపడ్డారు. శాంతి భద్రతలు అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘర్షణలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ గొడవలు రాజకీయ మలుపు తిరిగాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జరిగిన అల్లర్లపై టీఎమ్‌సీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి...ఈ కేసు CID చేతికి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. వెంటనే సీఐడీ విచారణ జరపాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. గొడవ జరిగిన ప్రాంతంలో భద్రతనూ కట్టుదిట్టం చేశారు. CIDతో పాటు మరి కొన్ని స్పెషల్ బ్రాంచ్‌లు ఈ కేసుపై  పూర్తి స్థాయి విచారణ జరపనున్నాయి. 


Also Read: Imran Khan Praised India: భారత్‌పై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసలు, అది చాలా గొప్ప విషయం అంటూ కితాబు