Imran Khan Praised India: 


క్రూడాయిల్ కొనుగోలుపే ప్రశంసలు..


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇండియా అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని పొగిడారు. రష్యా నుంచి చీప్‌ క్రూడ్ ఆయిల్‌ను కొనుగోలు చేయడం సాధారణ విషయం కాదని, భారత్ ఇది సాధించిందని అన్నారు. దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేసిన ఆయన...తన హయాంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్టు వివరించారు. కానీ అనుకోకుండా తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల అది కుదరలేదని అసహనం వ్యక్తం చేశారు. 


"భారత్‌ లాగే పాకిస్థాన్ కూడా రష్యా నుంచి చీప్ క్రూడ్ ఆయిల్‌ను కొనుగోలు చేయాల్సింది. నా హయాంలో ఈ ప్రయత్నం జరిగింది. కానీ దురదృష్టవశాత్తూ మా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఉన్నట్టుండి మా గవర్నమెంట్ కూలిపోయింది. అందుకే ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయాం. ప్రస్తుతం మా దేశం సంక్షోభంలోకి కూరుకుపోయింది. కనీసం ఇప్పుడైనా రష్యా నుంచి తక్కువ ధరకే క్రూడాయిల్‌ను కొనుగోలు చేయొచ్చు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయలేకపోతోంది"


- ఇమ్రాన్ ఖాన్, పాక్ మాజీ ప్రధాని


ప్రధాని మోదీపైనా...


గతంలోనూ ఇమ్రాన్ ఇదే విషయంలో భారత్‌ను పొగిడారు. అమెరికా ఎంత ఒత్తిడి చేసినప్పటికీ పట్టించుకోకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అసాధారణ విషయం అంటూ ప్రశంసించారు. ఇప్పుడు మరోసారి అభినందించారు. ప్రధాని మోదీని కూడా ఓ సారి ఆకాశానికెత్తేశారు ఇమ్రాన్. నవాజ్ షరీఫ్‌కు అన్ని కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తూనే...ప్రధాని మోదీ పేరుని ప్రస్తావించారు. "పొరుగు దేశమైన భారత ప్రధాని మోదీ ఆస్తి ఎంత..? మీకు మాత్రం ఇంత ఆస్తి ఎలా వచ్చింది" అంటూ నవాజ్ షరీఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అదే కొంప ముంచిదా..? 


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయంగా ముడి చమురుకు కొరత ఏర్పడుతోంది. గతేడాది ఫిబ్రవరిలో ఇమ్రాన్ ఖాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. అప్పుడే పాకిస్థాన్‌ను టార్గెట్ చేశాయి పశ్చిమ దేశాలు. ప్రపంచ దేశాలన్నీ రష్యా చర్యల్ని ఖండిస్తుంటే...పాక్ మాత్రం రష్యాతో అంటకాగుతోందంటూ మండి పడ్డాయి. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్‌..పుతిన్‌తో భేటీ కాకపోయుంటే పరిస్థితులు మరీ ఇంత దారుణంగా ఉండేవి కావని అంటున్నారు కొందరు నిపుణులు. ఈ పర్యటన తరవాతే అమెరికా పాక్‌పై ఒత్తిడి పెంచింది. ఫలితంగా పాక్ ఆర్మీ చీఫ్‌ ఇమ్రాన్‌పై అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఆ తరవాత జరిగిన వరుస పరిణామాలు ఆయనను గద్దె దించాయి. ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందని ఇమ్రాన్ ఎంతగా ఆరోపించినా...చేతులారా ఆయనే చేసుకున్నారని అంటున్నారు కొందరు ఎక్స్‌పర్ట్స్. ఇప్పుడు మరోసారి ప్రధాని కావాలని ఆరాటపడుతున్నారు. కానీ ఆ కల తీరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయనపై కేసులు నమోదు చేసి ఎక్కడికక్కడ కట్టి పడేశారు. జైల్లోనే ఉంచేందుకు షెహబాజ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 


Also Read: Air India Flight విమానం గాల్లో ఉండగా గొడవ పడిన ప్యాసింజర్, ఎమర్జెన్సీ ల్యాండింగ్