Air India Flight:


ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో గొడవ 


ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌లలో రోజుకో గొడవ జరుగుతోంది. ప్రయాణికులు గొడవ పడడమో, ఫుల్‌గా తాగేసి రచ్చ చేయడమో లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడలాంటి ఘటనే మరోటి జరిగింది. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్తున్న ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ విమాన సిబ్బందితో గొడవకు దిగాడు. టేకాఫ్‌ అయిన కాసేపటికే ఈ గొడవ మొదలైంది. చేసేదేమీ లేక వెంటనే మళ్లీ ఢిల్లీలో ల్యాండ్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు Air India యాజమాన్యం ఆ ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. ఇవాళ ఉదయం (ఏప్రిల్ 10) 6.35 నిముషాలకు ఢిల్లీ నుంచి విమానం బయల్దేరింది. కాసేపటికే ప్యాసింజర్‌కి, సిబ్బంది మధ్య గొడవైంది. వెంటనే ఢిల్లీకి తిరుగు పయనమైంది ఫ్లైట్. సిబ్బంది ఆ ప్యాసింజర్‌ను పోలీసులకు అప్పగించి మళ్లీ లండన్‌కు బయల్దేరింది. 


"ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 111 ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ ఉన్నట్టుండి గొడవ మొదలవడం వల్ల మళ్లీ ఢిల్లీలో ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఆ ప్యాసింజర్‌ మా మాట వినలేదు. మేం ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఊరుకోలేదు. అనుచితంగా ప్రవర్తించాడు. నోటికొచ్చినట్టు మాట్లాడాడు. మా సిబ్బందిపై చేయి కూడా చేసుకున్నాడు. అందుకే పైలట్‌ వెంటనే ఢిల్లీకి ఫైట్‌ని మళ్లించాడు. భద్రతా సిబ్బందికి ఆ వ్యక్తిని అప్పగించాం. ఆ తరవాత మళ్లీ లండన్‌కు బయల్దేరింది. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. వాళ్లు కేసు నమోదు చేశారు. ప్రయాణికులు ఎవరైనా డిగ్నిటీగా ఉండాలి. గాయపడిన సిబ్బందికి మా తరపున చేయాల్సినదంతా చేస్తున్నాం. ఈ అంతరాయానికి చింతిస్తున్నాం. వెంటనే ఫ్లైట్‌ని రీషెడ్యూల్ చేశాం. "


- ఎయిర్ ఇండియా యాజమాన్యం 


అంతకు ముందు ఇండిగో ఫ్లైట్‌లో  ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది ఎంత చెప్పినా వినలేదు. ఫ్లైట్ టేకాఫ్‌ అయిన కాసేపటికే నానా రచ్చ చేశాడు. డోర్ తీయండి అంటూ గొడవ పెట్టాడు. ఎలాగోలా ఆ వ్యక్తిని కంట్రోల్ చేసిన సిబ్బంది చివరకు పోలీసులకు అప్పగించింది. 


ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఈ మధ్య యూరినేషన్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తరవాత కంపెనీ అలెర్ట్ అయింది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. దీనిపై ఇంకా చర్చ జరుగుతుండగానే మళ్లీ వార్తల్లో నిలిచింది Air India. 
లండన్ నుంచి ముంబయికి వస్తున్న ఫ్లైట్‌లో ఓ 37 ఏళ్ల వ్యక్తి బాత్‌రూమ్‌లో సిగరెట్‌ తాగడం కలకలం రేపింది. రమాకాంత్‌ అనే వ్యక్తి సిగరెట్ తాగడమే కాకుండా తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడు. కంపెనీ ఫిర్యాదుతో ముంబయి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఫ్లైట్‌లో సిగరెట్‌ తాగేందుకు అనుమతి లేదని, చెప్పినా వినకుండా ఆ వ్యక్తి అందరినీ ఇబ్బందికి గురి చేశాడని ఎయిర్ ఇండియా సిబ్బంది వెల్లడించింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. DGCA కూడా వీటిని తీవ్రంగా పరిగణిస్తోంది. 


Also Read: Twitter - BBC: ట్విటర్‌పై మండి పడుతున్న BBC,ఆ లేబుల్‌ తీసేయాలని డిమాండ్