IPOs in April 2023: స్టాక్ మార్కెట్ ఒడిదొడుకుల మధ్య, గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో IPO మార్కెట్ బాగా లేదు. ఆ ఆర్థిక సంవత్సరం చివరి నెలల్లో కొన్ని IPOలు మాత్రమే పెట్టుబడిదార్లను పలకరించాయి. పబ్లిక్ ఆఫర్లకు (IPOs) ఈ ఆర్థిక సంవత్సరం బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 54 కంపెనీలు ఐపీఓల కోసం సన్నాహాలు చేస్తుండగా, ఈ నెలలోనే (ఏప్రిల్‌లో) రెండు చిన్న కంపెనీల ఐపీఓలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
AG యూనివర్సల్ IPO
AG యూనివర్సల్ (AG Universal) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌తో, ఈ ఆర్థిక సంవత్సరంలో చిన్న కంపెనీల బోణీ ప్రారంభం అవుతుంది. ఈ కంపెనీ IPOలో 14,54,000 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఒక్కో షేర్ ముఖ విలువ 10 రూపాయలు. IPO పరిమాణం రూ. 8.72 కోట్లు. ఈ ఆఫర్ ఏప్రిల్ 11న (మంగళవారం) ప్రారంభమై ఏప్రిల్ 13న ముగుస్తుంది. IPOలో జారీ చేసే ఒక్కో షేరు ధరను గరిష్టంగా రూ. 60గా కంపెనీ నిర్ణయించింది. కనీసం 2000 షేర్లకు ఇన్వెస్టర్లు బిడ్ వెయ్యాల్సి ఉంటుంది. ఈ షేర్ NSE SMEలో లిస్ట్ అవుతుంది.
వారం తర్వాత రెండో IPO
AG యూనివర్సల్ IPOకు వారం తర్వాత రెటీనా పెయింట్స్ (Retina Paints) IPO ప్రారంభం అవుతుంది. రూ. 11.10 కోట్ల పరిమాణం ఉన్న ఈ IPOలో, ఒక్కోటి రూ. 10 ముఖ విలువ కలిగిన 37,00,000 ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఒక్కో షేర్ ఇష్యూ ధర రూ. 30 కాగా, కనీసం 4000 షేర్ల కోసం ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 19న ఓపెన్ అవుతుంది, ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుంది.
గత సంవత్సరంలో IPO మార్కెట్ ఇలా ఉంది
గత ఆర్థిక సంవత్సరం గురించి చెప్పాలంటే, ఆ కాలంలో మొత్తం 38 కంపెనీలు ఐపీఓల ద్వారా మొత్తం రూ. 52,600 కోట్లు సమీకరించాయి. ఈ 38 కంపెనీల్లో కేవలం రెండు కంపెనీల షేర్లు మాత్రమే 50 శాతం కంటే ఎక్కువ ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ షేర్లు 55 శాతం ప్రీమియంతో, ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా షేర్లు 52 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ప్రభుత్వ బీమా సంస్థ LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) IPO కూడా గత ఆర్థిక సంవత్సరంలోనే వచ్చింది, సుమారు 9 శాతం డిస్కౌంట్‌తో లిస్ట్ అయింది.
IPO కోసం క్యూలో 54 కంపెనీలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) గురించి మాట్లాడుకుంటే, ఈ కాలంలో 54 కంపెనీలు IPO తీసుకురావడానికి లైన్‌లో ఉన్నాయి. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం, ఈ 54 కంపెనీలు ఇప్పటికే SEBI అనుమతి పొందాయి, బహిరంగ మార్కెట్ నుంచి 76,189 కోట్ల రూపాయలను సేకరించేందుకు ప్రయత్నించబోతున్నాయి. ఇవి కాకుండా సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్న మరో 19 కంపెనీలు రూ. 32,940 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.