Mankind Pharma IPO: హెల్త్‌ కేర్ రంగంలో అతి పెద్ద ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్స్‌లో (IPO) ఒకటి, స్టాక్‌ మార్కెట్‌ తలుపు తట్టేందుకు సిద్ధమవుతోంది. మ్యాన్‌ఫోర్స్‌ కండోమ్స్‌ (Manforce condoms), ప్రెగా న్యూస్‌తో (Prega-news‌) జనాల్లో బాగా పాపులర్ అయిన మ్యాన్‌కైండ్ ఫార్మా (Mankind Pharma) కంపెనీ, ఐపీవోకు రావడానికి రెడీగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో 'డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌'ను (DRHP) సెబీకి దాఖలు చేసింది.


IPO ద్వారా, ప్రైమరీ మార్కెట్ నుంచి రూ. 4,200 కోట్ల నుంచి రూ. 4,700 కోట్ల వరకు సమీకరించడానికి ఈ కండోమ్‌ కంపెనీలు సన్నాహాలు చేస్తోంది. ఈ IPO ఈ నెలాఖరులో మార్కెట్‌ను పలకరించవచ్చు.


మ్యాన్‌కైండ్ ఫార్మా IPO ద్వారా... కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత పెట్టుబడిదార్లు తమ వాటాను విక్రయిస్తారు. కంపెనీ ప్రమోటర్ జునేజా కుటుంబం, పెట్టుబడిదార్లు కలిసి 4 కోట్లకు పైగా షేర్లను అమ్మబోతున్నారు. 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) కింద షేర్లను విక్రయించిన తర్వాత, కంపెనీలో ప్రమోటర్ వాటా 79 శాతం నుంచి 76.50 శాతానికి తగ్గుతుంది. 


సెబీకి దాఖలు చేసిన డ్రాఫ్ట్ పేపర్ ప్రకారం... రమేష్ జునేజా, రాజీవ్ జునేజా, శీతల్ అరోరా, రమేష్ జునేజా ఫ్యామిలీ ట్రస్ట్, రాజీవ్ జునేజా ఫ్యామిలీ ట్రస్ట్, శీతల్ అరోరా ఫ్యామిలీ ట్రస్ట్ కంపెనీ ప్రమోటర్ల లిస్ట్‌లో ఉన్నాయి. ప్రస్తుత వాటాదార్లలో.. కెయిర్న్‌హిల్ CIPEF లిమిటెడ్, బీజ్ లిమిటెడ్, లింక్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఉన్నాయి. 


సింగపూర్ ప్రభుత్వానికి చెందిన జీఐసీ, సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీలకు మ్యాన్‌కైండ్ ఫార్మాలో తలో పది శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. క్యాపిటల్ ఇంటర్నేషనల్ సంస్థకు మరో 11 శాతం వాటా ఉంది. 


OFS ద్వారా... ప్రమోటర్ జునేజా ఫ్యామిలీ కోటి షేర్లు, క్యాపిటల్ ఇంటర్నేషనల్ సుమారు 2 కోట్ల షేర్లు, బీజ్ కంపెనీ దాదాపు కోటి షేర్లు, లింక్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ 50 వేల షేర్లను విక్రయించబోతోంది. 


మొత్తం ఆఫర్ ఫర్ సేల్‌ రూట్‌లోనే..
ఐపీవో మొత్తం ఆఫర్ ఫర్ సేల్‌ రూట్‌లోనే సాగుతుంది. అంటే ఫ్రెష్‌ ఈక్విటీ షేర్‌ ఒక్కటి కూడా లేదు. OFS ద్వారా వచ్చే డబ్బు మొత్తం ఆయా ప్రమోటర్లు, షేర్‌హోల్డర్ల జేబుల్లోకే వెళ్తుంది తప్ప కంపెనీకి ఒక్క రూపాయి కూడా రాదు. ఒకవేళ మీరు ఈ ఐపీవోలో పాల్గొనాలనుకుంటే, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది.


వ్యాపారం
1991లో ప్రారంభమైన మ్యాన్‌కైండ్ ఫార్మా, మన దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటి. బ్రాండెడ్ జెనరిక్ మెడిసిన్స్‌తో పాటు; కంపెనీ అమ్ముతున్న ఫేమస్‌ బ్రాండ్లలో ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్‌లు, మ్యాన్‌ఫోర్స్ కండోమ్‌లు, గ్యాస్-ఓ-ఫాస్ట్ ‍‌(Gas-O-Fast) ఆయుర్వేదిక్ యాంటాసిడ్స్‌, మొటిమలను తగ్గించే ఔషధం ఆక్నీస్టార్ (AcneStar) ఉన్నాయి. 


2022లో దేశీయ విక్రయాల పరంగా దేశంలో నాలుగో అతి పెద్ద కంపెనీగా అవతరించింది. కంపెనీ ఆదాయంలో 98 శాతం భారత్‌లోని వ్యాపారం ద్వారా వస్తోంది. 


ఆదాయాలు
2020, 2021, 2022 ఆర్థిక సంవత్సరాల్లో, భారతదేశంలో కార్యకలాపాల ద్వారా వరుసగా ₹5,788.8 కోట్లు, ₹6,028 కోట్లు, ₹7,594.7 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. విదేశీ ఆదాయాన్ని కూడా కలుపుకుంటే, ఆయా సంవత్సరాల్లో భారతదేశ వ్యాపార వాటా వరుసగా 98.70%, 97.01%, 97.60%గా ఉంది. భారత్‌ తరువాత దీని ప్రధాన మార్కెట్లు అమెరికా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్.


2022 మార్చి 31 నాటికి హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్‌ సహా భారతదేశం అంతటా 23 తయారీ కేంద్రాలు ఉన్నాయి.


అగ్రిటెక్ విభాగంలోకి ప్రవేశించడానికి మ్యాన్‌కైండ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించనున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కంపెనీ ప్రకటించింది. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో ₹200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అప్పట్లో తెలిపింది.