కరోనా ఎదుర్కోవడంపై నేడు మాక్‌ డ్రిల్
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుతున్న వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై ఇవాళ(సోమవారం) మాక్ డ్రిల్ నిర్వహించనుంది. 
పాజిటివ్‌ కేసులో మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన కేంద్రం... ఆసుపత్రులు ఇతర సౌకర్యాలు పెంచుకోవాలని ఆదేశించింది. అందులో భాగంగా ఇవాళ, రేపు(సోమవారం, మంగళవారం) దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనుంది. 
ఈ మాక్‌డ్రిల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో స్టాఫ్ పాల్గొంటారు. కరోనా పేషెంట్ల చికిత్సకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా అనేది సరిచూసుకుంటారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆ వివరాలను జిల్లా అధికారులకు తెలియజేస్తారు. 


రెండు శాఖలపై సీఎం జగన్ సమీక్ష 


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ విద్యాశాఖపై సమీక్ష చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమీక్ష ప్రారంభంకానుంది. వచ్చే విద్యాసంవత్సరం కోసం జరుగుతున్న ఏర్పాట్లు ఇతర అంశాలపై సమీక్షలు అడిగి తెలుసుకుంటారు. 


సాయంత్రం మూడు గంటలకు వైద్యారోగ్య శాఖపై సమీక్ష జరపనున్నారు. కోరోనా కేసులు పెరుగుతన్న వేళ తీసుకుంటున్న జాగ్రత్తలు, కరోనా చికిత్సకు అవసరమైన సదుపాయాల అందుబాటులో ఉంచాలని అధికారులు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ జరిగే మాక్ డ్రిల్‌, ఇతర నివేదికలను తెలుసుకోనున్నారు. 


నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ టూర్


తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, అంబేడ్కర్ విగ్రహాలు ఆవిష్కరిస్తారు. ముందుగా తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు 11 గంటలకు చేరుకుంటారు. అక్కడే అంబేడ్కర్ విగ్రహం, చాకలి ఐలమ్మ విగ్రహాలు ఆవిష్కరిస్తారు. అనంతరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత దళితబంధు పథకం లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేస్తారు. 


మైనారిటీల గుర్తింపునకు చర్యలు తీసుకోవాలనే పిటిష్‌పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌తోపాటు చాలా మంది ఈ అంశంపై పిటిషన్లు వేశారు. రాష్ట్ర స్థాయిలో మైనార్టీలను గుర్తించడంతోపాటు గతంలో చేసిన చట్టల అమలును పిటిషన్‌దారులు ప్రశ్నించారు. 


బండి సంజయ్ పిటిషన్‌పై నేడు విచారణ 


టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. రీమాండ్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది. ప్రభుత్వానికి, స్కూల్ హెడ్ మాస్టర్‌కు గతంలోనే హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బండి సంజయ్ పేపర్ లీకేజీలో కుట్రదారుడు అన్నది తేలిందన్న అడ్వకేట్ జనరల్... ఆయనకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ ఉన్నాయన్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అని వాదించారు బండి సంజయ్‌ తరఫు న్యాయవాది రామచందర్ రావు. నేడు మరోసారి బండి సంజయ్ పిటిషన్ ఫై విచారణ చేపట్టనున్న హైకోర్టు. 


విద్యుత్ ఛార్జీలపై టీడీపీ ధర్నా 


ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారని ఆరోపణలతో తెలుగుదేశం ధర్నాలకు పిలుపునిచ్చింది. చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రేణులు ఆయా ప్రాంతాల్లోధర్నాలు, రాస్తారోకోలు చేపట్టనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దాడి మొదలు పెట్టారు. 57 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడుతున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 


వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు 20 ఏళ్లు
మాజీ ముఖ్యమంత్ర వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపుతిప్పింది అనడంలో ఎలాంటి సందేశం లేదు. అప్పటి నుంచి ఎన్నికల ముందు పాదయాత్రలు చేయడం ప్రజల మన్ననలు పొందడం తెలుగు రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. అలాంటి ట్రెండ్ సెట్ చేసిన ఆ పాదయాత్రకు 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2003 ఏప్రిల్‌ 9న పాదయాత్ర మొదలు పెట్టారు. 1,475 కిమీ (917 మైళ్ళు) మూడు నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా పాదయాత్ర చేశారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు. ముఖ్యమంత్రి గా ప్రమాణం చేశారు. 


ఆర్సీబీ వర్సెస్‌ లక్నో 


ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నేడు (ఏప్రిల్ 10) తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ సీజన్లో లక్నో జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించగా, ఆర్సీబీ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది.