కొంతమంది పిల్లలు పూర్తిగా 9 నెలలు అమ్మ గర్భంలో ఉండకుండా ముందే జన్మిస్తారు. కవలలు 9 నెలలు గర్భంలో ఉండడం కష్టం, అలాగే ట్రిప్లెట్స్ ( ముగ్గురు పిల్లలు) ఉన్నప్పుడు కూడా ఏడో నెలలోనే ప్రసవం అయ్యే అవకాశం ఉంది. అలాగే తల్లి ఆరోగ్య పరిస్థితులు వల్ల కూడా కొంతమంది పిల్లలు ఆరు లేదా ఏడో నెలలో పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలా నెలలు నిండకముందే పుట్టే పిల్లల్లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, శ్వాస మార్గాలు వారిలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందవు. అందుకే వారికి రెండు, మూడు సంవత్సరాలు వచ్చే వరకు శ్వాస కోశ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆ తర్వాత సాధారణ పిల్లలాగే ఉంటారు. కానీ ఈ సమస్యలు కేవలం వారి బాల్యానికే పరిమితం అవుతాయనుకుంటే భ్రమే. భవిష్యత్తులో వారు పెద్దయ్యాక, అంటే 30 ఏళ్లు దాటాక మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక తాజా అధ్యయనం చెబుతోంది. 


నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు మధ్య వయసు వచ్చాక (30 దాటాకా) ఆస్తమా బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. అలాగే ‘క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్’ వంటి ఊపిరితిత్తుల సమస్య వచ్చే ముప్పు కూడా అధికమే. ఈ రెండు సమస్యలు వస్తే శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. 


సాధారణంగా గర్భం ధరించాక 37 వారాలలోపే ప్రసవం అయితే దాన్ని ముందస్తు కాన్పు అంటారు. ఆ కాన్సులో పుట్టే పిల్లల్లో దాదాపు అన్ని అవయవాలు అభివృద్ధి చెందుతాయి. కానీ కొంతమంది పిల్లలు 28 వారాల్లోపే పుడతారు. అలాంటి పిల్లల్లోనే ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి వ్యాధులు వచ్చే ముప్పు మూడు రెట్లు అధికమని చెబుతున్నారు పరిశోధకులు. 


ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోటిన్నర మంది పిల్లలు నెలలు నిండకముందే జన్మిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే ఆధునిక కాలంలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉండడం వల్ల వీరంతా మరణం అంచుల నుంచి బయటపడుతున్నారు. కానీ వారి భవిష్యత్తులో మాత్రం ఆస్తమా వంటి సమస్యలు ముప్పతిప్పలుపెట్టే అవకాశం ఉందని వివరిస్తున్నారు అధ్యయనకర్తలు. ఇలాంటి వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.  నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చికిత్సలు కూడా ఏమీ అందుబాటులో లేవు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం ఒక్కటే వారి ముందున్న అద్భుత చికిత్స అని మాత్రం చెప్పుకోవాలి.



Also read: 105 మందిని పెళ్లి చేసుకున్న వ్యక్తి, ప్రపంచ రికార్డు ఇతని పేరు మీదే -పెళ్లిళ్లే అతని జీవనాధారం
















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.