ప్రపంచంలోనే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులకు ఎక్కాడు నికోలాయ్ పెరుస్కోవ్. ఇతను అమెరికాకు చెందిన వ్యక్తి. తన జీవితకాలంలో 105 మంది కంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకుని అతిపెద్ద వ్యాపారానికే తెర తీశాడు. ఆ 105 మందిలో ఒక మహిళకు కూడా ఇతర మహిళలతో పరిచయం లేదు. కేవలం 32 ఏళ్ల వ్యాధిలోని 105 మందిని పెళ్లి చేసుకున్నాడు ఈ మహానుభావుడు.  అంటే ఏడాదికి ముగ్గురి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది.


నికోలాయ్ అమెరికాలోని 27 రాష్ట్రాలకు చెందిన స్త్రీలతో పాటు, 14 ఇతర దేశాలకు చెందిన మహిళలను వివాహం చేసుకున్నాడు. ప్రతిసారి నకిలీ పేరును, నకిలీ గుర్తింపు కార్డుని వాడేవాడు. ప్రతి మహిళ దగ్గర కొత్త పేరును ఉపయోగించేవాడు. చివరిగా అతను 1981లో పెళ్లి చేసుకున్నాడు. ఆ చివర పెళ్లిలో తన పేరును గియోవన్నీ విగ్లియాట్టో అని చెప్పాడు. అతను పెళ్లి చేసుకునేది అమ్మాయిలు మీద ఇష్టంతోనో, కామంతోనో కాదు. కేవలం డబ్బు సంపాదించడానికి.పెళ్లిళ్లే అతని జీవనాధారంగా మార్చుకున్నాడు. 


వ్యాపారం ఎలా?
పెళ్లి చేసుకున్నాక తాను దూరంగా ఉద్యోగం చేస్తున్నానని, విలువైన వస్తువులు అన్నీ తీసుకుని అక్కడికి వెళ్లిపోదామని చెబుతాడు. ట్రక్కులో సరుకులన్నీ ఎక్కించాక, భార్యను వదిలి తాను మాత్రమే పారిపోతాడు. అలాగే తన భార్యల దగ్గర ఉన్న డబ్బులను తీసుకునేవాడు.  కొన్నిసార్లు అడిగి తీసుకునేవాడు, కొన్నిసార్లు దొంగిలించేవాడు. దొంగిలించిన వస్తువులను ఫ్లీ మార్కెట్లలో విక్రయించేవాడు. అలా విక్రయించి చాలా సంపాదించాడు.  అదే తన బతుకుదెరువుగా మార్చుకున్నాడు. అందుకే ఏడాదికి మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకునేవాడు. 1981లో షారన్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇతనిపై అనుమానం వచ్చింది. అతని గురించి తెలుసుకొని పోలీసులకి సమాచారం ఇచ్చింది. అతి కష్టం మీద పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 1981 డిసెంబర్ 28న అరెస్టు అయ్యాడు ఈ నిత్య పెళ్లి కొడుకు. అతని పెద్ద భార్య అంటే వంద మందిలో అందరికన్నా మొదటి చేసుకున్న భార్య కూడా అతనిపై అనేక కేసులు పెట్టింది. ఈ 105 మందిలో ఏ మహిళకు కూడా ఆయన విడాకులు ఇవ్వలేదు. ఆయన పోలీసులతో మాట్లాడుతూ తాను ఎంత మందిని పెళ్లి చేసుకున్నా వారందరినీ చాలా ప్రేమగానే చూసుకున్నానని, మర్యాదగానే ప్రవర్తించాలని చెప్పాడు. 105 మంది భార్యలను పొందడానికి ఏకంగా 50 మారుపేర్లను అతను ఉపయోగించాడు. అలాగే కొత్త చిరునామాలను సృష్టించాడు. 



105 మంది భార్యల పేర్లను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఆ భార్యల పేర్లు, వారి చిరునామాలతో ఒక జాబితా కూడా తయారు చేసుకున్నాడు. ఇతను చేసిన తప్పులన్నీ నిరూపణ అవడంతో 34 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కోర్టు భారీ జరీమానాన్ని కూడా కట్టమని చెప్పింది. ఎనిమిదేళ్లు అరిజోనా స్టేట్ జైల్లోనే గడిపాడు. ఈ వ్యక్తి 1991లో మెదడులో రక్తస్రావం కారణంగా 61 ఏళ్ల వయసులో మరణించాడు. 



Also read: పిల్లలకే కాదు పెద్దలకు టీకాలు అవసరమే, కచ్చితంగా తీసుకోవాల్సిన కీలకమైన టీకాలు ఇవిగో

















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.