Bangladesh Quota Row: రిజర్వేషన్‌ కోటా వివాదం బంగ్లాదేశ్‌ని అట్టుడికిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య ఉద్యమకారుల కుటుంబాలకు 30% కోటా ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు వారాల క్రితం ప్రభుత్వం ఈ ప్రకటన చేయగా అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లు క్రమంగా హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే 130 మంది ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఈ నిరసనలు ఇంత హింసకు దారి తీయడానికి ఓ కారణముంది. ప్రధానమంత్రి షేక్ హసీనా తన నిర్ణయాన్ని సమర్థించుకోవడమే కాకుండా అగ్నికి ఆజ్యం పోసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారులను రజాకార్లతో పోల్చారు. 1971లో బంగ్లాదేశ్‌లో స్వతంత్ర పోరాటం జరిగింది. ఆ సమయంలో ఈ ఉద్యమాన్ని రజాకార్‌లు అణిచివేయాలని చూశారు. అందుకే ఆ పేరు వింటేనే బంగ్లాదేశ్ ప్రజలు మండి పడతారు. ఈస్ట్ పాకిస్థాన్‌కి చెందిన ఈ రజాకార్‌ దళంతో ఆందోళనకారులను పోల్చడమే మరింత ఆగ్రహానికి కారణమైంది. 


రజాకార్‌ల చరిత్ర ఇదే..


బంగ్లాదేశ్ చరిత్రని రజాకార్‌లను విడదీసి చూడలేం. 1971లో విముక్తి పోరాటం జరిగింది. పాకిస్థాన్‌ నుంచి విడిపోయి స్వాతంత్య్రం కావాలని అందరూ ఉద్యమించారు. ఆ సమయంలోనే పాకిస్థాన్‌ ఆర్మీ ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు పారామిలిటరీ ఫోర్స్‌ని రంగంలోకి దింపింది. అదే Razakars దళం. ఈ సైన్యంలో పాకిస్థాన్‌కి మద్దతుగా ఉన్న బెంగాలీలతో పాటు, ఉర్దూ మాట్లాడే బిహారీలున్నారు. వీళ్లు చేయని దారుణమంటూ లేదు. అత్యాచారాలు, మూక హత్యలు, దాడులతో ఉద్యమకారులపై విరుచుకుపడ్డారు. లక్షలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరవాత స్వాతంత్య్రం సాధించినా ఈ ఉద్యమం మాత్రం చరిత్ర పుటల్లో చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆ ఉద్యమం సమయంలో అరాచకాలు చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా 2010లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రత్యేంగా ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అన్ని దారుణమైన చరిత్ర ఉన్న రజాకార్లతో ఆందోళనకారులు పోల్చడమేంటని కొందరు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అల్లర్ల తీవ్రత ఇంకా పెరుగుతూ పోతోంది. 


ప్రభుత్వం పట్టుదల..


పరిస్థితులు అదుపు తప్పుతుంటే వాటిని సరి చేయాల్సింది పోయి ప్రభుత్వం ఇంకా రెచ్చగొడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే కర్ఫ్యూ విధించింది. చాలా చోట్ల భద్రతా బలగాలు మొహరించి ఆందోళనకారులను కట్టడి చేస్తోంది. అంతే కాదు. షూట్ ఎట్ సైట్ ఆర్డర్‌లనూ ఇచ్చింది. గొడవలు చేసే వాళ్లు కనిపిస్తే కాల్చి పారేయండి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రిజర్వేషన్‌ల అంశం గతంలోనూ వివాదాస్పదమైంది. 1972లో ఇది అమల్లోకి తీసుకొచ్చారు. అయితే...విమర్శలు వస్తుండడం వల్ల 2018లో పక్కన పెట్టేశారు. ఇప్పుడు మరోసారి ప్రధాని షేక్ హసీనా ఈ రిజర్వేషన్‌లను అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టుదలగా ఉంది. కచ్చితంగా అమలు చేస్తామని తేల్చి చెబుతోంది. ఈ పట్టుదల వల్ల అల్లర్లు ఇంకా ఉద్ధృతమవుతున్నాయి. 


Also Read: Pins in Woman Head: యువతి తలలో 70 పిన్నులు, తాంత్రికుడి దుశ్చర్య - అవాక్కైన డాక్టర్లు!