National News in Telugu: ఒడిశాలో విస్మయం చెందే ఓ ఘటన చోటు చేసుకుంది. చేతబడులు చేసే ఓ తాంత్రిక వ్యక్తి బండారం మొత్తం బయటపడింది. 19 ఏళ్ల బాలికకు ఆయన చేసిన తాంత్రిక వైద్యం వికటించింది. ఫలితంగా ఆ బాలికకు విపరీతంగా గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యం పేరుతో ఏకంగా ఆమె తలలోకి పిన్నులు గుచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తాంత్రికుడిని సంతోష్ రానా ని పోలీసులు గుర్తించారు.


ఒడిశాలోని బాలింగీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి తలలోకి తాంత్రిక విద్యలు తెలిసినట్లుగా చెబుతున్న ఓ మాంత్రికుడు ఏకంగా 70 సూదులను గుచ్చాడు. మూఢనమ్మకంతో బాధితులు కూడా అతణ్ని నమ్మారు. ఫలితంగా ఆమె ఆస్పత్రిపాలైంది. శుక్రవారం డాక్టర్లు ఆమెకు సిటీ స్కానింగ్‌ పరీక్ష చేసి విస్మయం చెందారు. యువతి పుర్రెపై సూదులు ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి యువతి తలలోని 70 సూదులను బయటికి తీశారు. తలలోని కపాలం ఎముకపై ఉన్న సూదులు మరింత లోపలికి చొచ్చుకొని పోలేదని.. తద్వారా మెదడుకు ఏమీ కాలేదని డాక్టర్లు తెలిపారు. తద్వారా యువతి ఆమె ప్రాణాలతో బయటపడిందని చెప్పారు. పోలీసులు మాంత్రికుడిని అరెస్టు చేశారు.


అదే జిల్లాలో సింథికేలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇచ్‌గావ్‌ గ్రామానికి చెందిన రేష్మా బెహరా అనే 19 ఏళ్ల యువతి మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె తండ్రి బిష్ణు బెహరా.. మంచి డాక్టర్లకు చూపించకుండా సంతోష్ తేజ్‌రాజ్‌ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించారు. తాంత్రిక వైద్యం పేరుతో ఆ మాంత్రికుడు పలు దఫాలుగా రేష్మా తలలోకి 70 సూదులను గుచ్చాడు. ఇటీవల యువతి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు వింసార్‌ ఆసుపత్రికి తరలించగా.. మాంత్రికుడి అసలు గుట్టు బయటపడింది.