Babiya Crocodile Passes Away: శాకాహార మొసలిగా ప్రసిద్ధి చెందిన బబియా క్రొకోడైల్ మృతి చెందింది. కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉండే ఈ మొసలిని చూసేందుకు పర్యటకులు కూడా వచ్చేవారు. ఎన్నో ఏళ్లుగా ఆ ఆలయ చెరువులో ఉంటోన్న 'బబియా' మృతి చెందినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.


అన్నం మాత్రమే






ఈ మొసలి కేరళలోని అనంతపుర గ్రామంలోని దేవాలయంలో ప్రధాన ఆకర్షణగా ఉండేది. కేవలం అన్నం (ప్రసాదం) మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించేది. ఈ మొసలి అనంత పద్మనాభ స్వామి ఆలయం చెరువులో ఉండేది. ఈ ఆలయం చెరువులోకి మొసలి ఎలా వచ్చిందనేది ఎవరికి తెలియదు. అంతేకాదు ఈ మొసలికి 'బబియా' అన్న పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. దాదాపు 70 ఏళ్లుగా ఈ మొసలి మాత్రం ఆ ఆలయ సరస్సులోనే ఉంటోంది.


పూజారితో స్నేహం


ఈ మొసలికి ఆ ఆలయ పూజారికి మధ్య ఎంతో స్నేహం ఉండేదని స్థానికులు చెబుతారు. రోజూ పూజారి  ఆ మొసలికి రెండు సార్లు అన్నం పెడతారట. ఒక్కోసారి ఆయనే అన్నాన్ని బంతిలా చేసి ఆ మొసలి నోటికి అందిస్తాడని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మొసలి ఎప్పుడూ ఎవరితోనూ క్రూరంగా ప్రవర్తించలేదట. ఆ చెరువులో ఉండే చేపలను కూడా తినలేదని వారు తెలిపారు.  


ఆలయ విశిష్టత


పురాణాల ప్రకారం తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి మూలస్థానం ఇదే. ఈ ఆలయాన్ని అనంత పద్మనాభస్వామి ఆలయం లేదా అనంతపుర సరస్సు దేవాలయం అని పిలుస్తారు. కాసరగోడ్ జిల్లా మంజేశ్వరం తాలూకాలోని కుంబ్లా పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపుర అనే చిన్న గ్రామంలోని సరస్సు మధ్యలో ఈ దేవాలయం ఉంది.


తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి (పద్మనాభస్వామి ఆలయం) మూలస్థానం ఇదేనని భక్తులు అనంత పద్మనాభుడు స్థిరపడిన అసలు క్షేత్రం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాన్ని సందర్శించేటప్పుడు అక్కడ సరస్సుకు కుడి వైపు ఉన్న గుహను కూడా తప్పక చూడాలి. ఎందుకంటే స్థల పురాణం ప్రకారం, అనంత పద్మనాభుడు ఆ గుహ గుండా తిరువనంతపురం వరకు వెళ్లేవారట. అందువల్ల ఈ రెండు ఆలయాలకు ఒకే పేరు వచ్చింది. 


Also Read: Nobel Prize 2022 In Economics: ఆర్థిక శాస్త్రంలో ఆ ముగ్గురికి నోబెల్ బహుమతి!


Also Read: Mulayam Singh Yadav Death: 'కాకలు తీరిన యోధుడు- రాజకీయ చదరంగంలో కురువృద్ధుడు'