Ayodhya Ram Mandir Event: 


రిటర్న్ గిఫ్ట్‌లు 


ఈ నెల 22న అయోధ్య ఉత్సవానికి (Ayodhya Ram Mandir Opening) ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. వారం ముందు నుంచే 16వ తేదీనే సన్నాహక కార్యక్రమాలు మొదలు కానున్నాయి. దాదాపు వారం రోజుల పాటు అయోధ్య నగరం రామ నామ స్మరణ చేయనుంది. ఈ క్రమంలోనే ఏర్పాట్లకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust అందరికీ తెలియజేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి రానున్నారు. వేలాది మంది సాధువులు ఈ కార్యక్రమంలోనే పాల్గొననున్నారు. రామ మందిరాన్ని నిర్మించిన కూలీల కుటుంబ సభ్యులకూ ఆహ్వానం అందింది. అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 11 వేల మంది కీలక వ్యక్తులు వస్తారని అంచనా. వీళ్లలో చాలా మంది VIPలే ఉన్నారు. వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడంతో పాటు ఉత్సవానికి వచ్చినందుకు కృతజ్ఞతగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వనున్నారు. జనవరి 12 నుంచి అయోధ్యకి వచ్చే వాళ్లకి సనాతన్ సేవా న్యాస్‌ (Sanatan Seva Nyas) సంస్థ టోకెన్‌లు ఇవ్వనుంది. రాముడి కానుకగా వీటిని అందజేయనున్నారు. దర్శనం పూర్తైన తరవాత ప్రసాదంతో పాటు ఈ గిఫ్ట్‌లు ఇస్తారు. ఇందులో రెండు బాక్సులుంటాయి. ఓ బాక్స్‌లో లడ్డు ప్రసాదం ఉంటుంది. ఈ ప్రసాదాన్ని ఆవుపాలు, తులసీ ఆకులతో తయారు చేస్తారు. ఇక రెండో బాక్స్‌లో అయోధ్య నేల మట్టి, సరయూ నది నీళ్లతో పాటు ఓ మొమెంటో ఉంటుంది. వీటితో పాటు ఓ ఇత్తడి పళ్లెం, వెండి నాణెం ఉంటాయి. అయోధ్య రామ మందిర చిత్రం వాటిపై ముద్రించారు. ఈ రెండు బాక్స్‌లు పట్టేలా ప్రత్యేకంగా ఓ బ్యాగ్‌నీ తయారు చేయించారు.
 


రామ మందిరం నిర్మాణంపై సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామంచల ప్రదీప్ కుమార్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రామాలయం మొత్తం రాయిని ఉపయోగించి నిర్మించాం. ఇది శాశ్వతంగా నిలిచిపోవాల్సిన కట్టడం. ఇనుమును ఉపయోగిస్తే అది తుప్పు పట్టే ఆస్కారం ఉంది. అంతేగాక భూకంపాలు వంటి తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలను కూడా ఆలయం తట్టుకోవాలి’’ అని అన్నారు. రామ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైన రాయిని వినియోగించారు. రాళ్లను ప్రత్యేకమైన గాడిలో కత్తిరించి.. జోడించారు. ఇలా జోడించేందుకు కూడా కాంక్రీటు వాడలేదు. రామాలయ నిర్మాణానికి వాడిన గులాబి రంగు రాయి అంతా కూడా రాజస్థాన్ లోని భరత్వ్ పూర్ గల బన్సీపహార్ పూర్ నుంచి తెచ్చారు. ఈ గులాబి రాయి జీవిత కాలం చాలా ఎక్కువ. అంతేకాదు ఈ రాయి చాలా దృఢమైంది కూడా.అయోధ్య రామాలయం నాగర శైలి పద్ధతిలో నిర్మించారు. ఈ శైలిలో ఇనుమును ఉపయోగించరాదు. ఉత్తర భారత దేశంలోని మూడు నిర్మాణ పద్ధతుల్లో ఇదొక పద్ధతి. ఈ పద్ధతి నిర్మాణాలు వింధ్య, హిమాలయ పర్వత మధ్య ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.


Also Read: ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ప్రధాని మోదీ సరిపడా ఇళ్లు కట్టిస్తారు - రాజస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు