Rajasthan Minister Babulal Kharadi: 


రాజస్థాన్ మంత్రి వ్యాఖ్యలు..


రాజస్థాన్ మంత్రి బాబులాల్ ఖరాడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, వాళ్లందరికీ సరిపోయేలా ప్రధాని మోదీ ఇళ్లు కట్టించి ఇస్తారని నోరు జారారు. ఎవరూ ఆకలితో పడుకోకుండా ఉండాలన్నదే ప్రధాని లక్ష్యం అని అన్నారు. ఆ తరవాత మోదీ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి ప్రస్తావించినప్పటికీ...పిల్లల గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి. బాబూలాల్‌కి ఇద్దరు భార్యలు. 8 మంది పిల్లలు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో వేదికపై ముఖ్యమంత్రి భజన్‌ లాల్ శర్మ కూడా ఉన్నారు. ఉదయ్‌పూర్‌లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర క్యాంప్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఇలా సందర్భం లేని మాటలు మాట్లాడడం వల్ల వేదికపై ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఈ ఈవెంట్‌కి వచ్చిన ప్రజలు ఒకరిని చూసి ఒకరు గట్టిగా నవ్వుకున్నారు. ఇది పార్టీ వర్గాలను కాస్త ఇబ్బందికి గురి చేసింది. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని, సంక్షేమ పథకాలు అమలు చేయడం మోదీ వల్లే సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు బాబూలాల్ ఖరాడి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలని పిలుపునిస్తూ...అలా పిల్లల గురించి ప్రస్తావించి నవ్వుల పాలయ్యారు. 


"దేశ పౌరులెవరైనా సరే...నిలువ నీడ లేకుండా ఆకలితో అలమటించకూడదన్నదే ప్రధాని మోదీ కల. మీరు ఎంత మంది పిల్లల్నైనా కనండి. మన ప్రధాని మోదీ అందరికీ సరిపడ ఇళ్లు కట్టించి ఇస్తారు. మీకెలాంటి సమస్య రాకుండా చూసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరని రూ.200 వరకూ తగ్గించింది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్‌ని ఉజ్వల స్కీమ్‌ కింద రూ.450కే అందిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటు వేసి గెలిపించండి"


- బాబులాల్ ఖరాడి, రాజస్థాన్ మంత్రి