Mynampally Rohit Rao Watch Cost: రాజకీయ నాయకుల్లో చాలా మంది కుబేరులు ఉంటారనే ప్రచారం ఉంది. అందులో చాలా మంది అలా పైకి కనిపించరనే ప్రచారం ఉంది. వాళ్లు వాడే కార్లు, ధరించే వస్తువులపై ప్రజలకు ఎప్పుడు ఆసక్తి ఉంటుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఫారిన్ కార్లలో సచివాలయానికి చాలా సార్లు వచ్చారు. దీనిపై పలు రకాలు వార్తలు వచ్చాయి. మామూలుగా ఎంతటి ఎమ్మెల్యే అయినా సచివాలయానికి వచ్చే కార్లు సాదా సీదాగా ఉండేవి. కానీ మైనంపల్లి రోహిత్ ఫారిన్ కార్లలో సచివాలయానికి రావడం కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా ఆయన మరోసారి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయ్యారు. ఆయన చేతికి ధరించిన వాచ్ గురించి నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. 


మైనంపల్లి రోహిత్‌కు సంబంధించిన ఓ వీడియోను ‘మైనంపల్లి రోహిత్ మెదక్ టీం’ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. వాచ్ ధరను వెల్లడించింది. ‘రిచర్డ్ మిల్లె’ కంపెనీకి చెందిన వాచ్‌ను రోహిత్ ధరించారని, దీని విలువ దాదాపు రూ. 3 కోట్లు అని చెప్పడంతో నెటిజన్లు ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయినా డబ్బు ఉండాలే కాని.. మూడు కోట్లు ఏంటి ముప్పై కోట్ల వాచ్ అయినా పెట్టుకోవచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.






యువ ఎమ్మెల్యేగా గుర్తింపు
ఎన్నికలకు దాదాపు ఆరు నెలల ముందు రాజకీయరంగ ప్రవేశం చేసిన మైనంపల్లి రోహిత్ రావు ​కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గ చరిత్రలో 26 ఏళ్ల వయసులోనే అసెంబ్లీలో అడుగుపెడుతూ రికార్డు సృష్టించారు. తన తండ్రి మైనంపల్లి హన్మంతరావు అండతో గత ఫిబ్రవరిలో మెదక్​ నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చారు.  మైనంపల్లి సోషల్​ సర్వీస్​ ఆర్గనైజేషన్​ (ఎంఎస్​ఎస్​ఓ) ఓ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 


తద్వారా ప్రజల మద్దతు కూడగట్టుకున్న రోహిత్​ రావు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్​ స్థానంలో పోటీ చేసేందుకు బీఆర్​ఎస్​ టికెట్​ ఆశించారు. అయితే బీఆర్ఎస్​ హైకమాండ్​ సిట్టింగ్​ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్​ టికెట్ ఆశించి భంగపడ్డ రోహిత్ తండ్రి హన్మంతరావు​తో కలిసి కాంగ్రెస్‌​లో చేరి మెదక్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఇదివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, విశేష రాజకీయ అనుభవం ఉన్న బీఆర్ఎస్​ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్​ రెడ్డితో తలపడిన రోహిత్ 10,157 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.  


గతంలో జర్నలిస్ట్‌పై ఫైర్
ఓ విషయంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ ప్రవర్తనపై  విమర్శలు వెల్లువెత్తాయి. సచివాలయంలోనే సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సిద్దిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై దాడి చేశారు. ‘ఎన్నటికైనా నా చేతిలోనే చస్తావ్‌.. ఎప్పుడైనా నేనే నిన్ను చంపేస్తా’ అంటూ బెదిరించారు. మెదక్‌ సీటు విషయంలో విశ్లేషణలు చేసినందుకు శ్రీనివాసరరెడ్డిపై మండిపడ్డారు. ‘నా గురించి ఏం మాట్లాడినవు రా.. ఎన్నటికైనా నా చేతిలోనే చస్తావ్‌.. ఎప్పుడైనా నేనే నిన్ను చంపేస్తా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడే ఉన్న జర్నలిస్టులు, పోలీసులు జోక్యం చేసుకుని విడిపించారు.