CM Eknath Shinde Gets Emotional: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యుల అంచనాలను ఎప్పుడూ అందుకోలేకపోయానని అన్నారు. ఓ తండ్రిగా, భర్తగా ఫెయిల్ అయిపోయానని వెల్లడించారు. కొల్హాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు. శిందే కొడుకు, ఎంపీ శ్రీకాంత్ శిందే తన తండ్రి ఎప్పుడూ తమకు టైమ్ ఇవ్వలేదని, రాజకీయాల్లో ఉండడం వల్ల బిజీగా ఉండే వారని ఇటీవలే ఓ ఈవెంట్‌లో మాట్లాడారు. ప్రజలకే ఎక్కువ సమయం కేటాయించేవారని చెప్పారు. ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ "ఓ తండ్రిగా, భర్తగా నేను ఎప్పుడూ కుటుంబ సభ్యుల అంచనాలు అందుకోలేకపోయాను. ఈ విషయంలో ఫెయిల్ అయ్యాను" అని అన్నారు ఏక్‌నాథ్ శిందే. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు తుడుచుకుంటూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ తరవాత మళ్లీ సోషల్ మీడియాలోనూ ఈ విషయాన్ని పంచుకున్నారు. తన కొడుకు కళ్లు తెరిపించాడని, తన గతాన్ని గుర్తు చేసి భావోద్వేగానికి లోనయ్యేలా చేశాడని అన్నారు. 


"శ్రీకాంత్‌ శిందే స్పీచ్ నా కళ్లు తెరిపించింది. నా గతాన్ని మళ్లీ నాకు గుర్తు చేసింది. తనను ఎవరు బాల్యం గురించి అడిగినా సరే నా గురించి చెప్పేది తక్కువే ఉంటుంది. నేను ఎక్కువగా వాళ్లతో సమయాన్ని గడిపింది లేదు. నేను రోజంతా బయటే ఉండేవాడిని. ఇంటికి వచ్చే సరికే వాళ్లు పడుకుని ఉండే వాళ్లు. ఎప్పుడో 15 రోజులకోసారి కలుసుకునే వాళ్లం. ఇన్ని రోజులకు ఇంత మంది ముందు శ్రీకాంత్ తన మనసులోని బాధని బయటకు చెప్పాడు. నాన్నను చూస్తుంటే గర్వంగా ఉందని అన్నాడు. నాకు కూడా శ్రీకాంత్‌ని చూస్తుంటే గర్వంగానే ఉంటుంది. నా కుటుంబం శివసేన పార్టీయే. మేం చేసిన అభివృద్ధి గురించి ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. నేను ఎప్పుడూ భవిష్యత్‌ గురించి ఆలోచించలేదు. ప్రజల కోసమే పని చేసుకుంటూ వచ్చాను"


- ఏక్‌నాథ్ శిందే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి